జస్ట్ 10 నిమిషాలు.. ఇంట్లోనే అమృతం తయారు చేసుకోవచ్చు.. ఎండాకాలం ఓ గ్లాసు తాగితే కూల్ కూల్..

వేడి వాతావరణంలో అలసట, డీహైడ్రేషన్ సమస్యలతో పాటు జీర్ణ సమస్యలు ఎదుర్కొంటున్న వారికి బార్లీ నీరు ఒక సులభమైన, ప్రభావవంతమైన సహజ పరిష్కారం.. ఈ పురాతన ఆయుర్వేద పానీయం శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడమే కాకుండా, అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

జస్ట్ 10 నిమిషాలు.. ఇంట్లోనే అమృతం తయారు చేసుకోవచ్చు.. ఎండాకాలం ఓ గ్లాసు తాగితే కూల్ కూల్..
Barley Water

Updated on: Mar 27, 2026 | 3:30 PM

ఆధునిక జీవనశైలిలో ఎదురయ్యే డీహైడ్రేషన్, జీర్ణ సమస్యలు, అనేక ఇతర ఆరోగ్య సవాళ్లకు బార్లీ నీరు ఒక పురాతన, సహజసిద్ధమైన, ప్రభావవంతమైన పరిష్కారం. ఆయుర్వేదంలో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. ఇది శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడమే కాకుండా, సమగ్ర ఆరోగ్యాన్ని పెంపొందించే అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఈ కథనంలో బార్లీ నీటి తయారీ, దాని అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు, ఆయుర్వేద ప్రాముఖ్యత గురించి వివరంగా తెలుసుకుందాం.. వాస్తవానికి బార్లీ నీరు ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలతో (మెగ్నీషియం, మాంగనీస్, సెలీనియం, ఐరన్) నిండిన అద్భుతమైన ఆరోగ్య పానీయం.. ఇది మూత్రపిండాల ఆరోగ్యం, బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ.. శరీరాన్ని డీటాక్సిఫై చేయడంలో సహాయపడుతుంది.

బార్లీ నీరు ఆరోగ్య ప్రయోజనాలు:

జీర్ణక్రియ మెరుగుపడుతుంది: బార్లీ నీటిలో అధికంగా ఉండే డైటరీ ఫైబర్ ఆరోగ్యకరమైన గట్ మైక్రోబయోమ్‌ను ప్రోత్సహిస్తుంది, ప్రేగు కదలికలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది గ్లూకోజ్ శోషణను నెమ్మదిస్తుంది.. తద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. మధుమేహులు లేదా రక్తంలో చక్కెర నియంత్రణకు ప్రయత్నిస్తున్న వారికి ఇది చాలా ప్రయోజనకరమైనది.

కొలెస్ట్రాల్ నియంత్రణ: బార్లీ నీరు శరీరం నుండి బైల్ యాసిడ్‌ను తొలగించడం ద్వారా కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. కాలేయం కొత్త బైల్ యాసిడ్‌ను తయారుచేయడానికి ఎక్కువ కొలెస్ట్రాల్‌ను ఉపయోగించేలా చేయడం ద్వారా మొత్తం కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది.

మూత్రనాళ ఆరోగ్యం: ఇది సహజమైన మూత్రవిసర్జనకారిగా పనిచేస్తుంది.. మూత్ర ఉత్పత్తిని పెంచుతుంది. మూత్ర నాళాల నుండి విష పదార్థాలు, బ్యాక్టీరియాను బయటకు పంపడంలో సహాయపడుతుంది. ఈ డిటాక్సిఫికేషన్ ప్రక్రియ కాలేయానికి కూడా మేలు చేస్తుంది.

ఎలక్ట్రోలైట్ సమతుల్యత: పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం వంటి ముఖ్యమైన ఖనిజాలు బార్లీ నీటిలో సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో ద్రవ సమతుల్యత, కండరాల పనితీరుకు చాలా అవసరం. వేడి వాతావరణం, శారీరక శ్రమ లేదా వ్యాయామం వల్ల కోల్పోయే ఎలక్ట్రోలైట్లను భర్తీ చేయడంలో ఇది సహాయపడుతుంది.
ఆయుర్వేదం ప్రకారం, బార్లీ నీరు వాత, పిత్త, కఫ అనే త్రిదోషాలను సమతుల్యం చేయగలదు.

బార్లీ నీరు మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవడానికి సులభమైన, పోషకాలతో నిండిన పానీయం. ఇది డీహైడ్రేషన్ నుండి జీర్ణక్రియ వరకు, కొలెస్ట్రాల్ నియంత్రణ నుండి ఎలక్ట్రోలైట్ సమతుల్యత వరకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

బార్లీ నీటి తయారీ ఇలా:

ఈ ఆరోగ్యకరమైన పానీయాన్ని తయారుచేయడం చాలా సులభం. 10 నిమిషాల్లో సులభంగా తయారు చేసుకోవచ్చు..

కావలసినవి:

పావు కప్పు బార్లీ లేదా బార్లీ గింజల పొడి..

నాలుగు కప్పుల నీరు

రుచికి సరిపడా నిమ్మరసం కొంచెం నల్ల ఉప్పు

బార్లీ నీరు తయారీ విధానం:

బార్లీని పారే నీటి కింద శుభ్రంగా కడిగి, కనీసం రెండు గంటలపాటు నాలుగు కప్పుల నీటిలో నానబెట్టండి. లేదా.. డైరెక్టుగా పొడి తీసుకోండి..

ఒక గిన్నెలో నాలుగు కప్పుల నీరు తీసుకుని దానిలో బార్లీ గింజల పొడి లేదా.. బార్లీ గింజలు వేసి బాగా మరగబెట్టండి.

తక్కువ మంటపై 5 నిమిషాల పాటు ఉడికించండి. బార్లీ గింజలు మెత్తగా, కొద్దిగా జిగటగా మారిన తర్వాత మంటను ఆపివేయండి.

చల్లారిన తర్వాత, రుచి కోసం కొద్దిగా నిమ్మరసం కలుపుకొని తాగవచ్చు. ఈ నీటిని రోజంతా కొద్దికొద్దిగా సిప్ చేస్తూ తాగడం మంచిది. లేదా నేరుగా కూడా తాగవచ్చు..

బార్లీ నీటిని ఎప్పుడైనా తాగవచ్చు.. ఉదయాన్నే తాగితే.. మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us