
వినాయకుడికి మనం చేసే నైవేద్యంలో ఒక్కటి దద్దోజనం.. చాలా ప్రత్యేకమైన నైవేద్యం. ఇది ఇంట్లో సులభంగా, తక్కువ సమయంలో తయారు చేసుకోగలిగిన రుచికరమైన ప్రసాదం. దేవాలయాల్లో ఇచ్చే ప్రసాదంలా ఉండే ఈ దద్దోజనాన్ని అన్నం, పెరుగు, పాలు, కొన్ని ప్రత్యేకమైన పోపు దినుసులతో తయారు చేస్తారు. దీనిలో ఉండే మంచి పోషకాలు, సులభంగా జీర్ణమయ్యే గుణం వల్ల ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఈ ప్రసాదాన్ని మీరు కూడా ఇంట్లో సులభంగా తయారు చేసి భక్తితో సమర్పించండి.
దద్దోజనం తయారు చేయడానికి ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి కొద్దిసేపు నానబెట్టాలి. తర్వాత ప్రెషర్ కుక్కర్‌లో తగినన్ని నీళ్లు పోసి, బియ్యం వేసి మెత్తగా ఉడికించాలి. కుక్కర్లో ఆవిరి తగ్గిన తర్వాత మూత తీసి అన్నం వేడిగా ఉన్నప్పుడే బాగా మెత్తగా మెదపాలి. ఆ మెత్తని అన్నంలో కాచి చల్లార్చిన పాలు పోసి బాగా కలపాలి. అన్నం పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టాలి.
అన్నం చల్లారిన తర్వాత అందులో పెరుగు, తగినంత ఉప్పు వేసి గరిటెతో బాగా కలపాలి. ఇప్పుడు పోపు కోసం ఒక చిన్న కడాయిలో నూనె వేడి చేసి అందులో ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడగానే శెనగపప్పు, మినపపప్పు వేసి లేత బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.
ఆ తర్వాత కరివేపాకు, నల్ల మిరియాల పొడి, ఇంగువ వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ పోపు మిశ్రమాన్ని పెరుగు కలిపిన అన్నంలో వేసి బాగా కలపాలి. దద్దోజనం తయారైన తర్వాత కొద్దిసేపు పక్కన పెడితే రుచి మరింత పెరుగుతుంది. ఆ తర్వాత నైవేద్యంగా సమర్పించడానికి బాగుంటుంది.
రుచి, అలంకరణ కోసం దానిమ్మ గింజలు, తురిమిన క్యారెట్ లేదా దోసకాయ ముక్కలతో అలంకరించవచ్చు. ఈ దద్దోజనం ప్రసాదంగా ఎంతో శ్రేష్టమైనది. ఇంట్లో సులభంగా తయారు చేసుకోవచ్చు.