
ప్రస్తుత కాలంలో చాలామంది డయాబెటిస్ (మధుమేహం) తో బాధపడుతున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా లక్షలాది మంది దీనితో పోరాడుతున్నారు. డయాబెటిస్ అనేది రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణం కంటే ఎక్కువగా ఉండే దీర్ఘకాలిక వ్యాధి.. ఇది శరీరానికి సరిపడినంత ఇన్సులిన్ ఉత్పత్తి కానప్పుడు లేదా ఉన్న ఇన్సులిన్‌ను సరిగ్గా ఉపయోగించుకోలేనప్పుడు వస్తుంది. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్న వారు తీసుకునే ఆహారం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మందికి పలు సందేహాలు వస్తుంటాయి.. డయాబెటిస్ ఉన్నవారు చేపలు తినవచ్చా అనే ప్రశ్న తరచుగా ఉత్పన్నమవుతుంది. అయితే.. దీనిపై వైద్యులు ఫుల్ క్లారిటీ ఇస్తున్నారు.
డయాబెటిస్ ఉన్నవారు చేపలు తినడంలో ఎటువంటి ఇబ్బంది లేదని, వాస్తవానికి ఇది లీన్ ప్రోటీన్ కు అద్భుతమైన మూలమని వైద్య నిపుణులు చెబుతున్నారు. చేపలలో విటమిన్ డి, ఐరన్ వంటి అనేక విలువైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు శరీరానికి చాలా అవసరం. కండరాల బలోపేతానికి చేపలు పనికివస్తాయని పేర్కొంటున్నారు.
అయితే.. చేపలను వండే విధానం వాటి పోషక విలువలను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అధిక ఉష్ణోగ్రత వద్ద వండటం వల్ల చేపలలోని విటమిన్లు, ఖనిజాలు నశించే అవకాశం ఉంది. దీనికి విరుద్ధంగా, కుండలో తక్కువ మంటపై వండటం ఒక ఆరోగ్యకరమైన ప్రక్రియ.
అలాగే.. చేపల కూరలో నూనె వాడకం గురించి కూడా జాగ్రత్త వహించాలి. సాధారణంగా చేపల కూర అంటే ఎక్కువ నూనె వాడుతుంటారు.. అయితే వీలైనంత తక్కువ నూనెతో వండటం అలవర్చుకోవాలి.
చేపల పులుసులో వాడే మసాలాలకు కూడా కొన్ని పోషక విలువలు ఉంటాయి. కొన్ని మసాలాలకు యాంటీ-ఆక్సిడెంట్, యాంటీ-ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నందున అవి రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. అయితే, మసాలాలను, ముఖ్యంగా కారం, ఉప్పును, మితంగా వాడాలంటున్నారు. అధికంగా కారం వాడటం వల్ల ఎసిడిటీ, గ్యాస్ట్రైటిస్ వంటి జీర్ణ సమస్యలు తలెత్తవచ్చని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు..
ఏదైనా ఆహారాన్ని మితంగా తీసుకోవడం చాలా ముఖ్యం. డయాబెటిస్ ఉన్నవారు చేపలను సరైన పద్ధతిలో వండి, మితంగా తీసుకోవడం ద్వారా వాటి పూర్తి పోషక ప్రయోజనాలను పొందవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..