Water Intoxication: సంపూర్ణమైన ఆరోగ్యం కోసం నిత్యం తగినంతగా నీరు తాగాలని వైద్య నిపుణులు చెబుతుంటారు. తగిన స్థాయిలో నీటిని తాగడం వల్ల మానవ శరీరం అలసిపోకుండా చురుగ్గా ఉంటుంది. అయితే చాలా మంది నీటిని తక్కువగా తీసుకుంటేనే కదా సమస్య అనుకుని పరిమితికి మించి తాగుతుంటారు. అది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని నిపుణులు అంటున్నారు. అధిక మొత్తంలో నీటిని తీసుకోవడం వల్ల వాటర్ ఇంటాక్సికేషన్ లేదా హైపోనాట్రేమియా అనే సమస్య ఎదురవుతుంది. శరీరంలోని ఎలక్ట్రోలైట్ల సమతుల్యత.. ముఖ్యంగా సోడియం, అధిక నీటిని తీసుకోవడం వల్ల ఈ సమస్య సంభవిస్తుంది.
అలాగే ఎక్కువ మొత్తంలో నీటిని తాగడం వల్ల మూత్రపిండాలపై ఎక్కువ ప్రభావం పడుతుంది. అవి పనిచేసే సామర్థ్యం తగ్గడంతో పాటు శరీరం నుంచి వ్యర్థాలను తొలగించే శక్తి కూడా నశిస్తుంది. ఇంకా అధిక నీటి కారణంగా ఎదురయ్యే హైపోనాట్రేమియా లక్షణాల్లో భాగంగా వికారం, రక్తపోటు, తలనొప్పి, గందరగోళం, మూర్ఛ, కోమా, శ్వాస సంబంధిత సమస్యలు కూడా ఎదురవుతాయి. ఇవే కాక బరువు పెరిగే సమస్య కూడా ఎక్కువగా ఉంటుంది.
అధిక నీటి కారణంగా సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉన్న నేపథ్యంలో.. రోజువారీ అవసరం, వయసు, బరువు, కార్యాచరణ స్థాయి, వాతావరణ పరిస్థితులను బట్టి నీటిని తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. సాధారణ వ్యక్తి రోజుకు 8 గ్లాసులు లేదా 2 లీటర్ల నీరు తాగితే సరిపోతుందని వారు సూచిస్తున్నారు. అలా అని మరీ తక్కువగా కూడా తాగవద్దని, దాని వల్ల డీహైడ్రేషన్ సమస్య ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..