
Drinking Tea Immediately After Meals: టీ లేదా ఛాయ్ తాగడం అనేది సర్వ సాధారణమైన విషయం. ఉదయం, సాయంత్రం టీ తాగదనిదే కొందరికి ఏ పని ముందుకు సాగదు. ఇక కొందరైతే ఉదయం సాయంత్రంతోపాటు మధ్య మధ్యలో టీలు తాగుతూనే ఉంటారు. వీరికి టీ తాగేందుకు ఒక సమయం అంటూ ఉండదు. అయితే, ఇలా ఎడాపెడా టీలు తాగడం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇంకా కొందరికైతే భోజనం పూర్తయిన వెంటనే టీ లేదా కాఫీ తాగడం ఒక అలవాటు. ముఖ్యంగా ఆఫీస్ బ్రేక్‌లలో లేదా ఇంట్లో భోజనం తర్వాత “ఒక కప్పు టీ అయితే చాలు” అనుకునేవారు ఎక్కువే. కానీ, ఆరోగ్య నిపుణులు మాత్రం ఈ అలవాటు మన ఆరోగ్యానికి చాలా హానికరం అని హెచ్చరిస్తున్నారు.
ఐరన్ శోషణ తగ్గిపోతుంది.. టీ లో ఉండే టానిన్స్ (Tannins) అనే పదార్థాలు ఆహారంలో ఉన్న ఐరన్‌ను శరీరం గ్రహించకుండా అడ్డుకుంటాయి. దీని వల్ల ఐరన్ లోపం, అలసట, రక్తహీనత (Anemia) వచ్చే ప్రమాదం ఉంది.
జీర్ణక్రియ మందగిస్తుంది.. భోజనం తర్వాత టీ తాగితే కడుపులో జీర్ణ రసాల పనితీరు తగ్గుతుంది. ఫలితంగా గ్యాస్, అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి.
ప్రోటీన్ జీర్ణం సరిగా జరగదు.. టీలోని పాలీఫెనాల్స్ ప్రోటీన్లను బలంగా కట్టిపడేస్తాయి.దీంతో శరీరానికి అవసరమైన పోషకాలు పూర్తిగా అందవు.
అసిడిటీ సమస్యలు పెరుగుతాయి.. టీ లో ఉన్న క్యాఫైన్ కడుపులో ఆమ్లాన్ని పెంచుతుంది. దీర్ఘకాలంలో గ్యాస్ట్రిక్, హార్ట్‌బర్న్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
ఆరోగ్య నిపుణుల సూచన ప్రకారం.. భోజనం చేసిన తర్వాత కనీసం 45 నిమిషాల నుంచి 1 గంట గ్యాప్ ఇచ్చాకే టీ లేదా కాఫీ తాగడం మంచిది.
గోరువెచ్చని నీరు, సోంపు నీరు, మజ్జిగ.. జీర్ణానికి సహాయపడే హెర్బల్ డ్రింక్స్ తీసుకోవచ్చు. టీ ఆరోగ్యానికి పూర్తిగా చెడు కాదు. కానీ తినే సమయానికి దగ్గరగా తాగితే పోషకాల శోషణపై ప్రతికూల ప్రభావం పడుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. రోజువారీ చిన్న అలవాట్లే భవిష్యత్ ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి. భోజనం వెంటనే టీ తాగడం మానేసి.. కొద్దిసేపు విరామం ఇవ్వడం ద్వారా జీర్ణక్రియ మెరుగుపడి, శరీరానికి పూర్తి పోషకాలు అందుతాయి.