
నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలిలో మన జీవన విధానంలో ఎన్నో మార్పులు వచ్చేశాయ్. అధిక పని, మొబైల్ ఫోన్ల అధిక వినియోగంతోపాటు మన ఆహారపు అలవాట్లు చెదిరిపోతున్నాయి. అందువల్ల చాలామంది ఆలస్యంగా తినడం, నిద్రపోవడం వంటి వాటిని అలవాటు చేసుకున్నారు. వీటిని సాధారణ అలవాట్లుగా భావిస్తారు. కానీ దీని ప్రభావం వెంటనే గుర్తించబడకపోయినా అది క్రమంగా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా రాత్రి పూట ఆలస్యంగా తినడం వల్ల శరీర సమతుల్యత దెబ్బతింటుంది. ఇలా అలస్యంగా భోజనం చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయని చాలా మంది భావిస్తుంటారు. ఇలా రాత్రి ఆలస్యంగా తినడం వల్ల నిజంగా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయా? దీనికి అసలు కారణమేమిటో ఇక్కడ తెలుసుకుందాం..
రాత్రిపూట ఆలస్యంగా తినడం, రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం మధ్య బలమైన సంబంధం ఉందని నిపుణులు సైతం చెబుతారు. భోజన సమయం చక్కెర స్థాయిలను ప్రభావితం చేస్తుందని అనేక అధ్యయనాలు కూడా నిరూపించాయి. అందుకే ఈ అలవాటు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఆర్‌ఎంఎల్ హాస్పిటల్‌లోని మెడిసిన్ విభాగం డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ సుభాష్ గిరి మాట్లాడుతూ.. రాత్రి పూటఆలస్యంగా భోజనం చేసినప్పుడు, శరీరం దానిని సరిగ్గా ప్రాసెస్ చేయడం కష్టమవుతుంది. పగటిపూట కంటే రాత్రిపూట శరీరం నెమ్మదిగా పనిచేస్తుంది. అలాంటి సందర్భంలో తినే ఆహారం వెంటనే శక్తిగా మారదు. అందువల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరగవచ్చు. ముఖ్యంగా రాత్రి వేళల్లో తీపిగా ఉండే భోజనం తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి వేగంగా పెరుగుతుంది.
అధిక చక్కెర స్థాయిలు కేవలం మధుమేహ వ్యాధిగ్రస్తులకు మాత్రమే సమస్య కాదు. ఆరోగ్యకరమైన వ్యక్తికి కూడా, రాత్రి ఆలస్యంగా తినే అలవాటు భవిష్యత్తులో సమస్యలకు దారితీస్తుంది. తరచూ ఇలా చేయడం వల్ల శరీర చక్కెర నియంత్రణ వ్యవస్థ బలహీనపడుతుంది. క్రమంగా ఇది ఇన్సులిన్‌ను ప్రభావితం చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయి సాధారణం కంటే ఎక్కువగా పెరగడం ప్రారంభమవుతుంది. చాలా సందర్భాలలో ఈ అలవాటు మధుమేహం ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ సకాలంలో, సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.