
ఉదయం నిద్రలేవగానే కడుపు ఉబ్బరంగా, భారంగా అనిపిస్తుందా..? ఈ సమస్య మీకు మాత్రమే కాదు, చాలామందికి సర్వసాధారణంగా మారింది. ఆధునిక జీవనశైలి, సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం దీనికి ప్రధాన కారణాలు. రాత్రిపూట భారీ భోజనం చేయడం వల్ల గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి. కొంతమంది ఈ సమస్యలకు మందులపై ఆధారపడతారు. కానీ అవి దీర్ఘకాలంలో ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు. అటువంటి పరిస్థితుల్లో కొన్ని సహజ పద్ధతులను అనుసరించడం వల్ల సులభంగా ఉపశమనం పొందవచ్చు.
మన జీర్ణవ్యవస్థలో కార్బోహైడ్రేట్లు, చక్కెర, ఫైబర్ వంటి పదార్థాలు పూర్తిగా జీర్ణం కానప్పుడు, అవి పెద్ద ప్రేగులోకి చేరుకుంటాయి. అక్కడ ఉన్న బ్యాక్టీరియా వాటిని విచ్ఛిన్నం చేసేటప్పుడు గ్యాస్ ఏర్పడుతుంది. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే ఇతర ఆరోగ్య సమస్యలు రావొచ్చు.
ఉదయం వేడినీరు: మీకు గ్యాస్ సమస్యలు ఎక్కువగా ఉంటే ఉదయం ఖాళీ కడుపుతో ఒక గ్లాసు వేడినీరు తాగండి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచి, కడుపు తేలికపడటానికి సహాయపడుతుంది. కావాలంటే నిమ్మరసం కలిపి తాగితే శరీరం నుండి అదనపు సోడియం బయటకు వెళ్తుంది.
తేలికైన ఆహారం: రాత్రిపూట భారీ భోజనం గ్యాస్, ఉబ్బరానికి ప్రధాన కారణం. కాబట్టి రాత్రి తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని మాత్రమే తినడానికి ప్రయత్నించండి. ఇలా చేయడం వల్ల ఉదయం కడుపు తేలికగా ఉంటుంది.
హెర్బల్ టీ : పుదీనా, అల్లం, మెంతులతో చేసిన టీ తాగడం వల్ల గ్యాస్ నుండి త్వరగా ఉపశమనం లభిస్తుంది. ఈ పదార్థాలు జీర్ణవ్యవస్థలోని కండరాలను సడలించి, గ్యాస్ సులభంగా బయటకు వెళ్లేందుకు సహాయపడతాయి.
ఉదర మసాజ్: కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యల నుండి ఉపశమనం కోసం సున్నితంగా ఉదర మసాజ్ చేసుకోవచ్చు. చేతితో వృత్తాకార కదలికలో బొడ్డు చుట్టూ మసాజ్ చేయడం వల్ల గ్యాస్ బయటకు వెళ్లి కడుపు తేలికగా అనిపిస్తుంది.
ఈ సహజ పద్ధతులను మీ దైనందిన జీవితంలో భాగం చేసుకుంటే, గ్యాస్ సమస్యల నుండి దూరంగా ఉండవచ్చు. ఏదైనా ఆరోగ్య సమస్య తీవ్రంగా ఉంటే వైద్యుడిని సంప్రదించడం మంచిది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..