
దీపావళి పండగ దగ్గర పడుతోంది. దీంతో ప్రజలు తమ ఇళ్లను శుభ్రం చేసుకోవడంలో బిజీ బిజీగా ఉన్నారు. ఇంటి తలపులు, గోడలు, ఫర్నిచర్ సహా అన్ని అవసరమైన వస్తువులను శుభ్రం చేసుకుంటారు. అయితే చాలా మంది పూజ పాత్రలను శుభ్రం చేయడం అంటే అమ్మో చాలా సమయం పడుతుంది. అయినా కొత్తవాటిల్లా మెరవడం లేదు అని బాధపడుతూ ఉంటారు.
చాలా మంది రాగి, ఇత్తడి వస్తువులను పూజా కార్యక్రమాలలో ఉపయోగిస్తారు. అయితే అవి కాలక్రమేణా మెరుపుని కోల్పోయి పాతవాటిల్లా కనిపిస్తాయి. అయినా దేవుడి పూజకు ఉపయోగించే వస్తువులను శుభ్రం చేసుకోవడం తప్పని సరి కనుక వాటిని సులభంగా శుభ్రం చేసి కొత్తవాటిలా మెరిసేలా చేసేందుకు కొన్ని సింపుల్ టిప్స్ ఉన్నాయి. ఈ రోజు వంటింటిలో ఉండే వస్తువులతోనే రాగి ఇత్తడి వస్తువులను తళతళలాడే చేసుకోండి..
పటిక, నిమ్మకాయతో
పూజలో ఉపయోగించే రాగి, ఇత్తడి పాత్రలను శుభ్రం చేయడానికి పటిక, నిమ్మకాయను ఉపయోగించవచ్చు. దీని కోసం ముందుగా పటిక పొడిని నిమ్మరసంతో కలపండి. తరువాత ఈ మిశ్రమాన్ని పాత్రలను శుభ్రం చేయడానికి ఉపయోగించండి. ఇది పాత్రలపై ఉన్న మురికిని సులభంగా తొలగిస్తుంది. కొత్త పాత్రల్లా మెరుస్తూ ఉంటాయి.
బియ్యం పిండి వెనిగర్:
రాగి, ఇత్తడి పూజ పాత్రలను శుభ్రం చేయడానికి కూడా బియ్యం పిండిని ఉపయోగించవచ్చు. పిండిని కొద్దిగా ఉప్పు, వెనిగర్ తో కలిపి పేస్ట్ లా చేయండి. ఈ పేస్ట్ ని పాత్రలకు అప్లై చేసి సున్నితంగా రుద్దండి. ఇది పేరుకుపోయిన మురికిని సులభంగా తొలగిస్తుంది.
నిమ్మకాయ, ఉప్పు:
పూజా పాత్రలను నిమ్మకాయ, ఉప్పుతో కూడా శుభ్రం చేసుకోవచ్చు. ఒక నిమ్మకాయను రెండు భాగాలుగా కట్ చేసి దానిపై కొద్దిగా ఉప్పు చల్లుకోండి. ఈ నిమ్మకాయ చెక్కతో పాత్రలను రుద్దండి. కొన్ని నిమిషాల్లోనే నల్లటి పూత తొలగిపోయి .. కొత్త వస్తువుల్లా మెరుస్తూ కనిపిస్తాయి.
వెనిగర్, బేకింగ్ సోడా:
పూజా పాత్రలు తరచుగా చాలా మురికిగా మారుతాయి. వాటిని సాధారణ పద్ధతిలో శుభ్రం చేయడం కష్టమవుతుంది. అయితే వెనిగర్, బేకింగ్ సోడాతో సులభంగా శుభ్రం చేయవచ్చు. ఒక గిన్నెలో ఒక టీస్పూన్ బేకింగ్ సోడా ,రెండు టీస్పూన్ల వెనిగర్ కలపండి. కొద్దిగా నీరు కలిపి పేస్ట్ లా చేసి ఈ పేస్ట్ ని పాత్రలకు అప్లై చేయండి. ఈ పేస్ట్‌ను దాదాపు 10 నిమిషాలు అలాగే ఉంచండి. తరువాత ఆ పాత్రలను శుభ్రం చేయడానికి డిష్ వాషింగ్ డిటర్జెంట్ ఉపయోగించండి.
ఈ టిప్స్ తో కష్టం అనుకున్న పనిని ఇష్టంగా సులభంగా చేయండి. రాగి, ఇత్తడి పత్రాలు కొత్తవాటిల్లా తళతళలాడేలా చేసుకోండి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)