
షుగర్ ఉన్నవారిని వేధించే అత్యంత భయంకరమైన సమస్యల్లో ‘డయాబెటిక్ పెరిఫెరల్ న్యూరోపతి’ ఒకటి. దీనిపై ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ టి. వేణుగోపాల్ రావు పలు కీలక విషయాలు వెల్లడించారు. షుగర్ వ్యాధి కేవలం రక్తానికే పరిమితం కాదని, అది నరాల వ్యవస్థను ఎలా చిన్నాభిన్నం చేస్తుందో ఆయన వివరించారు. ఈ సమస్య బారిన పడిన వారికి కాళ్లలో మంటలు, మొద్దుబారడం, సూదులతో గుచ్చినట్లు ఉండటం లేదా చీమలు పాకుతున్నట్లు అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. నడుస్తున్నప్పుడు పాదాల పట్టు తప్పడం, చెప్పులు జారిపోవడం, స్పర్శ తెలియకపోవడం లాంటివి దీని ప్రధాన సంకేతాలు. కొంతమందిలో రాత్రి వేళల్లో ఈ నొప్పులు మరింత తీవ్రమవుతుంటాయి.
రక్తంలో చక్కెర స్థాయిలు దీర్ఘకాలం పాటు అదుపులో లేకపోతే, నరాలకు రక్తాన్ని అందించే సూక్ష్మ రక్తనాళాలు దెబ్బతింటాయి. దీనివల్ల నరాలకు అందాల్సిన ఆక్సిజన్, పోషకాలు అందక అవి క్రమంగా క్షీణిస్తాయి. దీనినే వైద్య పరిభాషలో ‘హైపాక్సియా’ అంటారు. ఆయుర్వేద ప్రకారం ఇది వాత, పిత్త దోషాల అసమతుల్యత వల్ల కలుగుతుంది. చాలామంది ఈ లక్షణాలను వయసు రీత్యా వచ్చే మార్పులుగా భావిస్తారు. కానీ, సరైన సమయంలో చికిత్స అందకపోతే స్పర్శ జ్ఞానం పూర్తిగా పోతుంది. ఫలితంగా కాళ్లకు చిన్న గాయాలైనా తెలియవు, అవి కాస్తా గ్యాంగ్రీన్‌గా మారి చివరికి కాలును తొలగించాల్సిన పరిస్థితి రావచ్చని డాక్టర్ హెచ్చరించారు.
ఇన్సులిన్ ప్లాంట్(Costus igneus), మధునాశిని(Gymnema sylvestre) ఆకులను ప్రతిరోజూ పరగడుపున నమిలి తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులోకి వస్తాయి. ఇంటి చిట్కాలు లేదా అరకొర సమాచారంతో కాలక్షేపం చేయకుండా, లక్షణాలు కనిపించిన వెంటనే నిపుణులను సంప్రదించాలి. అలోపతితో పాటు ఆయుర్వేదంలో కూడా ఈ సమస్యకు అద్భుతమైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. సరైన జీవనశైలి, మందులతో నరాల ఆరోగ్యాన్ని మళ్లీ మెరుగుపరుచుకోవచ్చని డాక్టర్ వేణుగోపాల్ రావు భరోసా ఇచ్చారు.
ఇది చదవండి: ప్రామిసరీ నోటు ఉన్నా డబ్బులు ఎగ్గొట్టారా.? ఈ ఒక్క పని చేస్తే చాలు ఇంటికి తిరిగొస్తాయ్..