Health Tips: ఊపిరితిత్తుల నుంచి చెవుల వరకు.. తుమ్ము ఆపుకుంటే ఏం జరుగుతుందో తెలుసా..?

తుమ్ము అనేది సహజ ప్రతిచర్య. ఏదైనా దుమ్ము, పొగ, పుప్పొడి, వైరస్-బ్యాక్టీరియా మన ముక్కులోని చిన్న వెంట్రుకలు, శ్లేష్మ పొరపైకి వచ్చినప్పుడు, మెదడు దానిని ముప్పుగా భావించి, బలమైన గాలితో ఊపిరితిత్తుల నుండి దానిని బయటకు పంపడానికి సంకేతాన్ని ఇస్తుంది. అదే తుమ్ము. తుమ్ము మనకు ఎంతో మేలు చేస్తుంది.

Health Tips: ఊపిరితిత్తుల నుంచి చెవుల వరకు.. తుమ్ము ఆపుకుంటే ఏం జరుగుతుందో తెలుసా..?
Dangers of Holding a Sneeze

Updated on: Aug 23, 2025 | 8:24 PM

చాలా మంది తుమ్ము వచ్చినప్పుడు ముక్కు, నోరు మూసుకుని అణిచివేసేందుకు ప్రయత్నిస్తారు. కానీ ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి తీవ్రమైన నష్టం కలుగుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తుమ్మును బలవంతంగా ఆపడం వల్ల శరీరానికి కలిగే నష్టాలు, ఎందుకు తుమ్మాలో అనే విషయాలను డాక్టర్లు వివరిస్తున్నారు.

తుమ్ము ఆపుకుంటే.. ప్రమాదాలే!

సాధారణంగా తుమ్మినప్పుడు శరీరంపై చాలా ఒత్తిడి ఏర్పడుతుంది. కానీ తుమ్మును అణిచివేసే ప్రయత్నం చేస్తే ఈ ఒత్తిడి సాధారణం కంటే చాలా రెట్లు పెరుగుతుంది. ముఖ్యంగా మగవారిలో ఊపిరితిత్తుల సామర్థ్యం ఎక్కువగా ఉండటం వల్ల వారి తుమ్ముల శబ్దం కూడా పెద్దగా ఉంటుంది. అంటే తుమ్ము యొక్క శక్తి ఊపిరితిత్తుల సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. ఇలాంటి శక్తివంతమైన తుమ్మును ఆపితే, అది మరింత ప్రమాదకరం.

తుమ్మును అణిచివేయడం వల్ల కలిగే నష్టాలు:

శ్వాసనాళ సమస్యలు: తుమ్మును ఆపడం వల్ల అదనపు ఒత్తిడి ఏర్పడి శ్వాసనాళ గొట్టాలు దెబ్బతినే అవకాశం ఉంది.

చెవి సమస్యలు: ముక్కు ద్వారా బయటకు రావాల్సిన గాలి చెవిలోకి నెట్టబడుతుంది. దీనివల్ల కర్ణభేరి ఉబ్బి, పగిలిపోవచ్చు.

కంటి సమస్యలు: కంటిపై ఒత్తిడి పెరిగి కంటి రక్తనాళాలు ఎర్రగా మారి దెబ్బతినే ప్రమాదం ఉంది.

ఇన్ఫెక్షన్స్: తుమ్మను ఆపడం వల్ల సూక్ష్మక్రిములు ముక్కు, గొంతులోనే చిక్కుకుని ఇన్ఫెక్షన్లకు దారితీస్తాయి.

తలనొప్పి, మైకం: తలలో ఒత్తిడి పెరిగి తీవ్రమైన తలనొప్పి, మైకం వంటివి రావచ్చు.

తుమ్ము అనేది శరీరానికి ఒక బహుమతి

డాక్టర్ల ప్రకారం.. తుమ్ము అనేది శరీరాన్ని శుభ్రపరిచే ఒక సహజమైన ప్రక్రియ. గాలిలోని దుమ్ము, ధూళి, పుప్పొడి రేణువుల వంటి అనవసరమైన పదార్థాలు ముక్కులోకి ప్రవేశించినప్పుడు, వాటిని బయటకు పంపడానికి శరీరం తుమ్ము రూపంలో స్పందిస్తుంది. అందుకే తుమ్మును అణిచివేయడం సరైన పద్ధతి కాదు.

తుమ్ము వచ్చినప్పుడు, మీ ముక్కు, నోటిని రుమాలు లేదా టిష్యూ పేపర్‌తో కప్పి తుమ్మాలి. ఆ తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోవడం మంచిది. ఇలా చేయడం ద్వారా ఇతరులకు ఇన్‌ఫెక్షన్లు వ్యాపించకుండా జాగ్రత్త పడవచ్చు. మొత్తానికి తుమ్మును ఆపకుండా దాని పనిని దానిని చేయనివ్వడం ఆరోగ్యానికి చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..