
మనం వంటల్లో సాధారణంగా ఉపయోగించే కొత్తిమీర కేవలం రుచి, సువాసన కోసమే కాదు.. ఇది ఎన్నో ఆరోగ్య, సౌందర్య ప్రయోజనాలను అందించే ఒక శక్తివంతమైన సహజ ఔషధం అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. దీనిని సరైన పద్ధతిలో ఉపయోగించడం ద్వారా అనేక సమస్యల నుండి విముక్తి పొందవచ్చని పేర్కొంటున్నారు. కొత్తిమీరలో విటమిన్ A, విటమిన్ C, విటమిన్ K వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది తక్కువ కేలరీలతో పాటు శరీధారానికి అవసరమైన ఖనిజాలను అందిస్తుందని.. దీనిని తప్పనిసరిగా ఆహారంలో చేర్చుకోవాలని పేర్కొంటున్నారు.
కొత్తిమీరలో యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మనం తీసుకున్న ఆహారాన్ని సరిగ్గా జీర్ణం కావడానికి సహాయపడతాయి. గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ఉత్పత్తిని మెరుగుపరచి, అజీర్తి, ఇతర జీర్ణ సంబంధిత సమస్యలను నివారిస్తుంది. ఇది కిడ్నీలు, లివర్‌ను డిటాక్స్ చేయడానికి కూడా దోహదపడుతుంది.
కొత్తిమీర టీ లేదా ధనియాల కషాయం ఋతుక్రమ సమయంలో వచ్చే క్రాంప్స్, నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఇంట్లో ఆడపిల్లలు పీరియడ్స్ నొప్పితో బాధపడుతున్నప్పుడు.. ఈ సహజ చిట్కాను ప్రయత్నించవచ్చని సూచిస్తున్నారు.
కొత్తిమీరలో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఆస్టియోపొరోసిస్ వంటి ఎముకల బలహీనతను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఎముకలను గుల్లబారకుండా చేసి, శరీరాన్ని బలంగా ఉంచుతుంది. క్రమం తప్పకుండా కొత్తిమీరను ఆహారంలో చేర్చుకోవడం వల్ల కాల్షియం కోసం ప్రత్యేకంగా పరుగులు తీయాల్సిన అవసరం ఉండదు. దీనిలోని విటమిన్ K రక్తం గడ్డకట్టడంలో, ఎముకల మరమ్మత్తులో కీలక పాత్ర పోషిస్తుంది.
కొత్తిమీర కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. రక్తనాళాల ఎలాస్టిసిటీని మెయింటైన్ చేయడం ద్వారా వాటిలో బ్లాకేజ్‌లు ఏర్పడకుండా చూస్తుంది. ఇది గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గించి, గుండెను పదిలంగా ఉంచడానికి తోడ్పడుతుంది.
కొత్తిమీరలో ఉండే ఫ్లేవనాయిడ్లు, యాంటీఆక్సిడెంట్లు యాంటీ ఏజింగ్ గుణాలను కలిగి ఉంటాయి. ఇవి లోపలి నుంచి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి అవయవాలు దెబ్బతినకుండా చూస్తాయి. బాహ్యంగా, కొత్తిమీర పేస్ట్‌ను కలబంద గుజ్జుతో కలిపి ముఖంపై ముడతలు ఉన్న చోట అప్లై చేసి, 30-40 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగితే చర్మ ముడతలు తగ్గుతాయి.
కొత్తిమీర పేస్ట్‌కు కొద్దిగా పసుపు కలిపి బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రదేశంలో అప్లై చేయడం వల్ల అవి తగ్గుతాయి. ఇది చర్మాన్ని శుభ్రపరిచి, సహజ మెరుపును అందిస్తుంది.
కొత్తిమీరలో ఇన్ని అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నందున, దీనిని కేవలం ఫ్లేవరింగ్ ఏజెంట్‌గా కాకుండా, మన ఆరోగ్యం, సౌందర్య సంరక్షణలో ఒక వజ్రాయుధంగా పరిగణించాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. అయితే.. ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు, ముందుగా వైద్యులను సంప్రదించడం మంచిది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..