Clove Extract Lowers Blood Sugar: కోవిడ్ మహమ్మారి చాలా మంది ప్రజల జీవన విధానంపై శాశ్వత ప్రభావాన్ని చూపింది. ఇమ్యునిటీ సిస్టంను దెబ్బతీయడమేకాకుండా, వర్క్ ఫ్రం హోం సంస్కృతికి నాంది పలికింది. ఫలితంగా గంటల కొద్దీ కదలకుండా కూర్చోవడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ విధమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు అందుకు ప్రధాన కారణమని నిపుణులు అంటున్నారు. నేటి కాలంలో అధిక మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో మధుమేహం ఒకటి. మన దేశంలో చాలా మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. డయాబెటిక్ రోగుల రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడం చాలా ముఖ్యం. రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరిగిపోతే తీవ్ర ఆరోగ్య సమస్యలు దాపురిస్తాయి. అందుకే డయాబెటిక్ పేషెంట్లు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలు తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. వంటిట్లో దొరికే లవంగాలు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో ఉపయోగపడతాయని మీకు తెలుసా? ప్రతి వంట గదుల్లో కనిపించే లవంగం మొగ్గలు మధుమేహ వ్యాధిగ్రస్తులకు దివ్యౌషధంలా పనిచేస్తుంది.
డయాబెటిక్ వ్యాధిగ్రస్తులకు లవంగం ఎలా పని చేస్తుందంటే..
ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే లవంగాలలో ఔషధ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. లవంగాలు తినడం వల్ల జలుబు, దగ్గు, తలనొప్పి వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. అంతేకాకుండా రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రించగల లక్షణాలు కూడా లవంగాలకు ఉంటుంది. ఐతే డయాబెటిక్ వ్యాధిగ్రస్తులు లవంగాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం మాత్రం మర్చిపోకూడదు.
మధుమేహ వ్యాధిగ్రస్తులు లవంగాలను ఎలా తినాలంటే..
గ్లాసు నీళ్లలో 8 లేదా 10 లవంగాలను ఉడకబెట్టాలి. ఈ నీటిని వడగట్టి గోరువెచ్చగా తాగాలి. ఈ విధంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు కనీసం మూడు నెలల పాటు ఇలా తాగితే రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.