
వంటగదిలోని చిమ్నీ జిడ్డుగా మారడం అనేది అందరికీ ఎదురయ్యే సమస్య. నూనె జిడ్డు, పొగ కారణంగా చిమ్నీ ఫిల్టర్లు మూసుకుపోయి సరిగ్గా పనిచేయవు. వీటిని శుభ్రం చేయడం పెద్ద పని అని చాలా మంది వాయిదా వేస్తుంటారు. అయితే, కేవలం 15 నిమిషాల్లో ఇంట్లో ఉండే వస్తువులతోనే చిమ్నీని కొత్త దానిలా మెరిపించవచ్చని మీకు తెలుసా..?
భారతీయ వంటల్లో తాలింపులు, నూనె వాడకం ఎక్కువగా ఉండటం వల్ల వంటింటి చిమ్నీలు త్వరగా జిడ్డుగా మారుతుంటాయి. ఈ జిడ్డును అలాగే వదిలేస్తే చిమ్నీ సామర్థ్యం తగ్గడమే కాకుండా వంటగదిలో దుర్వాసన వస్తుంది. ప్రొఫెషనల్ క్లీనర్ల సాయం లేకుండానే ఇంట్లోనే చిమ్నీని సులభంగా శుభ్రం చేసుకునే మార్గాలు ఇక్కడ ఉన్నాయి.
మొండి జిడ్డును తొలగించడంలో కాస్టిక్ సోడా అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఒక పెద్ద టబ్ లేదా వేడి నీరు ఉన్న బకెట్‌లో కాస్టిక్ సోడా వేసి, అందులో చిమ్నీ ఫిల్టర్లను 15 నిమిషాల పాటు నానబెట్టాలి. (గమనిక: దీనిని వాడేటప్పుడు చేతులకు గ్లౌజులు ధరించడం ముఖ్యం). ఆ తర్వాత సాధారణ నీటితో కడిగితే జిడ్డు మొత్తం వదిలిపోతుంది.
ఇది సురక్షితమైన మరియు సహజమైన పద్ధతి. ఒక గిన్నెలో బేకింగ్ సోడా, వెనిగర్, కొద్దిగా ఉప్పు కలిపి మిశ్రమం తయారు చేయాలి. ఈ మిశ్రమాన్ని ఫిల్టర్లపై రాసి, వేడి నీటిలో నానబెట్టాలి. ఇది జిడ్డును కరిగించి ఫిల్టర్లను శుభ్రపరుస్తుంది.
జిడ్డు తక్కువగా ఉన్నప్పుడు వేడి నీటిలో డిష్ వాషింగ్ లిక్విడ్ వేసి ఫిల్టర్లను నానబెట్టాలి. ఆ తర్వాత స్క్రబ్బర్‌తో రుద్దితే చిమ్నీ తళతళలాడుతుంది.
నిమ్మకాయలోని ఆమ్ల గుణాలు నూనె జిడ్డును వదిలించడానికి సహాయపడతాయి. చిమ్నీ పైభాగం (Outer body) శుభ్రం చేయడానికి నిమ్మరసం కలిపిన నీటిని ఉపయోగించి తుడిస్తే మంచి ఫలితం ఉంటుంది. చిమ్నీని నెలకు కనీసం రెండు సార్లు శుభ్రం చేసుకోవడం వల్ల అది ఎక్కువ కాలం మన్నిక వస్తుంది. పైన పేర్కొన్న చిట్కాలను పాటించడం ద్వారా తక్కువ సమయంలో, తక్కువ శ్రమతో మీ వంటింటిని పరిశుభ్రంగా ఉంచుకోవచ్చు. మీ చిమ్నీ ఎంత శుభ్రంగా ఉంటే మీ వంటగది అంత గాలి వెలుతురుతో తాజాగా ఉంటుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..