
తెలియని వ్యక్తుల ఇళ్లలో జరిగే ‘సప్పర్ క్లబ్‌లు’, పెయింటింగ్ లేదా కుండలు చేస్తూ భోజనం చేయడం వంటివి ఇందుకు నిదర్శనం. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా ఎక్స్‌పీరియెన్షియల్ డైనింగ్ అనే కొత్త ట్రెండ్ పుట్టుకొచ్చింది. దీనికి పరాకాష్టగా నిలుస్తోంది మిచెలిన్ స్టార్ హోటల్ ఎల్సియెలో. ఇక్కడ భోజనం మధ్యలో మీ చేతుల మీద ద్రవ రూపంలో ఉండే చాక్లెట్ పోస్తారు.
మీరు ఎప్పుడైనా ఖరీదైన రెస్టారెంట్‌కు వెళ్లినప్పుడు, అక్కడ వడ్డించే వారు మీ చేతుల మీద వేడి వేడి చాక్లెట్ ద్రవాన్ని పోస్తే ఎలా ఉంటుంది? షాక్ అవుతారు కదూ! కానీ అమెరికాలోని మయామి, వాషింగ్టన్ డి.సి.లో ఉన్న ‘ఎల్సియెలో’ రెస్టారెంట్‌కు వెళ్తే ఇది సర్వసాధారణం. అక్కడ భోజనం చేసే ప్రతి ఒక్కరూ ఈ ‘చాక్లెట్ థెరపీ’ని ఆస్వాదించాల్సిందే. ఇందుకోసం ఒక్కొక్కరు సుమారు రూ. 26,000 (289 డాలర్లు) ఖర్చు చేస్తారు. కేవలం రుచి మాత్రమే కాదు.. స్పర్శ, వాసన ద్వారా మన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేయడమే ఈ వింత ఆచారం వెనుక ఉన్న అసలు ఉద్దేశం.
ప్రముఖ చెఫ్ జువాన్ మాన్యువల్ బారియంటోస్ రూపొందించిన ఈ వినూత్న పద్ధతి పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తోంది. భోజనం మధ్యలో అతిథులకు ముందుగా ఒక చిన్న తువ్వాలు ఇచ్చి చేతులు శుభ్రం చేసుకోమంటారు. ఆ తర్వాత గోరువెచ్చని ద్రవ రూపంలో ఉన్న చాక్లెట్ ను వారి చేతులపై పోస్తారు. అతిథులు ఆ చాక్లెట్ ను తమ చేతులకు మెల్లగా రుద్దుకోవాలి.
ఆ సమయంలో వచ్చే చాక్లెట్ వాసన, దాని మెత్తని స్పర్శ మనసును ప్రశాంతంగా మారుస్తాయి. ఆ తర్వాత చేతులకు ఉన్న చాక్లెట్ ను నాకడం ద్వారా రుచి చూడాలి. ఇది వినడానికి వింతగా ఉన్నా, చిన్న పిల్లల్లా నియమాలు లేకుండా ఆహారాన్ని ఆస్వాదించే తత్వాన్ని ఇది గుర్తు చేస్తుంది. చివరగా నీటితో చేతులు కడిగించి మళ్ళీ తుడుచుకోవడానికి నాప్కిన్ ఇస్తారు.
ఈ రెస్టారెంట్ కేవలం చాక్లెట్ కే పరిమితం కాలేదు. ఇక్కడ కొలంబియన్ వంటకాలను అత్యంత కళాత్మకంగా వడ్డిస్తారు. వీటిలో ముఖ్యంగా ‘ట్రీ ఆఫ్ లైఫ్’ అనే వంటకం ప్రత్యేక ఆకర్షణ. దీనిని ఒక వైర్ బోన్సాయ్ చెట్టు ఆకృతిపై వడ్డిస్తారు. అలాగే బ్లాక్ ట్రఫుల్ తో చేసిన బన్యులోస్, వైన్ రిడక్షన్ తో చేసిన బైసన్ మాంసం వంటివి ఇక్కడి మెనూలో హైలైట్స్ గా నిలుస్తాయి. ప్రస్తుత ప్రపంచంలో భోజనం అనేది కేవలం ఒక ప్రదర్శనలా మారిపోయింది. కానీ ఇలాంటి అనుభవాలు మనల్ని కాసేపు ఆపి, మన ఇంద్రియాలను చురుగ్గా మారుస్తాయి.
జపాన్‌లోని ‘రెస్టారెంట్ ఆఫ్ మిస్టేకన్ ఆర్డర్స్’ వంటివి కూడా ఇలాంటి వినూత్న ఆలోచనలతోనే నడుస్తున్నాయి. ఆహారం ద్వారా ఒక కథను చెప్పడం, ఒక జ్ఞాపకాన్ని మిగిల్చడమే నేటి రెస్టారెంట్ల ప్రధాన లక్ష్యం. డైనింగ్ అనేది ఇప్పుడు కేవలం ప్లేట్ లో ఉన్న వంటకాలకే పరిమితం కాలేదు. మనం ఎవరితో తింటున్నాం, ఆ సమయంలో ఎలాంటి అనుభూతి పొందుతున్నాం అనేది ముఖ్యం. చేతులకు అంటుకున్న చాక్లెట్ జిగట, ఆ తీపి వాసన పర్యాటకులకు సరికొత్త అనుభవాన్ని ఇస్తున్నాయి.