AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tea Production: తేయాకు ఉత్పత్తిలో అగ్ర స్థానం ఆ దేశానిదే..! భారత్ స్థానమేంటో తెలుసా?

ప్రపంచ టీ ఉత్పత్తిలో చైనా ఏకంగా 53 శాతం వాటాతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. 2024లో ప్రపంచవ్యాప్తంగా 7.05 మిలియన్ మెట్రిక్ టన్నుల టీ ఉత్పత్తి కాగా, చైనా 3.74 మిలియన్ టన్నులతో తొలి స్థానంలో నిలిచింది. భారత్ 1.28 మిలియన్ టన్నుల ఉత్పత్తితో రెండో స్థానంలో ఉంది. ప్రపంచ టీ ఉత్పత్తిలో ఆసియా దేశాల ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తుండగా, వాతావరణ మార్పులు, పెరుగుతున్న గ్రీన్ టీ, బ్లాక్ టీ డిమాండ్ భవిష్యత్ ఉత్పత్తిపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

Tea Production: తేయాకు ఉత్పత్తిలో అగ్ర స్థానం ఆ దేశానిదే..! భారత్ స్థానమేంటో తెలుసా?
Tea Production
Sukumaar DG - Associate Editor
| Edited By: |

Updated on: Aug 22, 2026 | 11:32 AM

Share

ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న మొత్తం తేయాకులో ఏకంగా 53 శాతం వాటా కేవలం చైనా దేశానిదే కావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రతిరోజూ కోట్లాది మంది ఇష్టపడే ఈ పానీయం గురించి తాజాగా సంచలన నిజాలు వెలుగుచూశాయి. గత ఇరవై ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా తేయాకు ఉత్పత్తి దాదాపు రెట్టింపు స్థాయికి చేరుకుంది. 2024 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 7.05 మిలియన్ మెట్రిక్ టన్నుల టీ ఉత్పత్తి జరిగింది. కేవలం ఎనిమిది దేశాలు మాత్రమే ప్రపంచ ఉత్పత్తిలో ఏకంగా 93 శాతం వాటాను కలిగి ఉండటం విశేషం.

ఈ ప్రపంచ స్థాయి జాబితాలో ఆసియా దేశం చైనా నంబర్ వన్ స్థానంలో నిలిచింది. సుమారు 3.74 మిలియన్ టన్నుల ఉత్పత్తితో ప్రపంచ వాటాలో సగానికి పైగా తన ఖాతాలో వేసుకుంది. టీ పుట్టిల్లు అయిన చైనా ఈ రంగంలో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ దూసుకుపోతోంది. మన దేశం భారత్ సుమారు 1.28 మిలియన్ టన్నుల ఉత్పత్తితో ప్రపంచంలో రెండవ స్థానంలో నిలిచింది. ఇది ప్రపంచ మొత్తం తేయాకు ఉత్పత్తిలో 18 శాతం మాత్రమే కావడం గమనార్హం. అంటే మన దేశం కంటే చైనా దాదాపు మూడు రెట్లు ఎక్కువగా తేయాకును ఉత్పత్తి చేస్తూ చాలా ముందు వరుసలో కొనసాగుతోంది.

ఆసియా ఖండం వెలుపల ఉన్న ఆఫ్రికా దేశం కెన్యా ఈ జాబితాలో మూడవ స్థానంలో నిలిచింది. ప్రపంచ వాటాలో 8 శాతం నమోదు చేసి 599 వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తిని సాధించింది. ఆశ్చర్యకరంగా భారత్ కంటే తక్కువ ఉత్పత్తి చేస్తున్నప్పటికీ ప్రపంచ టీ ఎగుమతుల్లో కెన్యా అగ్రస్థానంలో ఉంది. టర్కీ దేశం ఉత్పత్తిలో నాల్గవ స్థానంలో ఉన్నప్పటికీ టీ తాగడంలో మాత్రం ఆ దేశ ప్రజలు అందరికంటే ముందున్నారు. అక్కడ తలసరి టీ వినియోగం ఏడాదికి మూడు కిలోల కంటే ఎక్కువగా నమోదు అవుతోంది. ఆ తర్వాత శ్రీలంక, వియత్నాం, ఇండోనేషియా మరియు జపాన్ దేశాలు వరుస స్థానాల్లో ఉన్నాయి.

భారత్, చైనా దేశాలు భారీగా తేయాకును ఉత్పత్తి చేస్తున్నప్పటికీ ఎగుమతులు తక్కువగా ఉన్నాయి. మన ఉత్పత్తిలో సగానికి పైగా టీ మన దేశంలోనే వినియోగిస్తున్నారు. దీంతో ఎగుమతుల మార్కెట్లో మన దేశం కొంత వెనుకబడి కేవలం స్థానిక మార్కెట్ అవసరాలను మాత్రమే తీరుస్తోంది. మొత్తంగా చూస్తే ప్రపంచ టీ ఉత్పత్తిలో ఆసియా దేశాలదే పూర్తి స్థాయి ఆధిపత్యం అని స్పష్టంగా తెలుస్తోంది. మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో భవిష్యత్తులో ఈ ఉత్పత్తి గణాంకాలు మరింత మారే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా గ్రీన్ టీ మరియు బ్లాక్ టీ వినియోగం ఇంకా పెరగనుంది.

Follow Us