Watermelon and Biryani: పుచ్చకాయ బిర్యానీ.. ఈ కాంబినేషన్‌ ఒంట్లో విషంలా మారుతుందా?

ముంబైలో ఇటీవల చోటు చేసుకున్న ఓ సంఘటన దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తినడం వల్ల ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు మృతి చెందిన వార్త తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ఘటన తర్వాత బిర్యానీ, పుచ్చకాయ రెండూ కలిపి తినడం వల్ల మరణం సంభవిస్తుందా? అనే సందేహం సర్వత్రా కలుగుతుంది. దీనిపై వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం..

Watermelon and Biryani: పుచ్చకాయ బిర్యానీ.. ఈ కాంబినేషన్‌ ఒంట్లో విషంలా మారుతుందా?
Watermelon And Biryani For Health

Updated on: May 06, 2026 | 8:59 PM

వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం తక్కువ సమయంలో బిర్యానీ, పుచ్చకాయ వెంటవెంటనే తినడం వల్ల నేరుగా మరణం సంభవించే అవకాశాలు చాలా తక్కువని ముంబైలోని ప్రఖ్యాత అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ ఈశ్వర్ గిలాడా అంటున్నారు. ఈ రెండూ వేర్వేరు రకాల ఆహారాలు. వాటి జీర్ణక్రియ సమయం కూడా భిన్నంగా ఉంటుంది. పుచ్చకాయ త్వరగా జీర్ణమవుతుంది. మాంసాహారమైన బిర్యానీ జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఈ వ్యత్యాసం జీర్ణక్రియలో హెచ్చుతగ్గులకు కారణమై కడుపు ఉబ్బరం లేదా అజీర్ణానికి దారితీస్తుంది. కానీ అది తక్షణ మరణానికి దారితీయదు.

అసలైన ప్రమాదం అదే

ఇలాంటి కేసులలో మరణానికి ప్రధాన కారణం ‘ఫుడ్ పాయిజనింగ్’ అయి ఉండవచ్చని వైద్యులు అనుమానిస్తున్నారు. ఆహారం లేదా పండ్లు ఎక్కువసేపు మూతపెట్టకుండా వదిలేసినా లేదా పాతవైనా, వాటిలో సాల్మొనెల్లా, ఇ. కోలి, స్టెఫిలోకాకస్ వంటి ప్రమాదకరమైన బ్యాక్టీరియా పెరిగే ప్రమాదం ఉంది.

సెప్సిస్ భయం

ఈ బాక్టీరియా శరీరంలోకి ప్రవేశించి తీవ్రమైన వాంతులు, విరేచనాలకు కారణమవుతాయి. నిర్జలీకరణం, ఎలక్ట్రోలైట్ అసమతుల్యత కారణంగా రక్తపోటు అకస్మాత్తుగా పడిపోయే ప్రమాదం ఉంది. ఇది సెప్సిస్ లేదా అవయవ వైఫల్యానికి దారితీస్తుంది. కొన్ని సందర్బాల్లో ప్రాణాంతకం కావచ్చు.

ఇవి కూడా చదవండి

పుచ్చకాయలోని రసాయనాలు

కొన్నిసార్లు పుచ్చకాయలు మరింత ఎర్రగా కనిపించడం కోసం లేదా త్వరగా పండటం కోసం వాటిలో ప్రమాదకరమైన రసాయనాలను కలుపుతారు. ఇలా కల్తీ చేసిన పండ్లను తిన్నప్పుడు, అవి శరీరంలో విషపూరితంగా మారవచ్చు. పుచ్చకాయ కలుషితమైతే లేదా దానికి విషపూరిత పదార్థాలను కలిపితేనే ఇలాంటి మరణాలు సంభవిస్తాయని వైద్యులు భావిస్తున్నారు.

నిపుణుల సలహా ఏమిటి?

తాజా ఆహారం తినాలి

హోటల్‌లో అయినా, ఇంట్లో అయినా ఆహారాన్ని వండిన వెంటనే తినడం ఉత్తమం. ఎక్కువ సేపు బయట ఉంచిన ఆహారాన్ని తినవద్దు.

పండ్ల శుభ్రత

పండ్లను కోయడానికి ముందు శుభ్రంగా కడగాలి. కోసిన వెంటనే తినండి. రసాయన రంగులు వేసిన పండ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలి.

గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం పరిశోధన అధ్యయనాలు, నిపుణుల అభిప్రాయాలపై ఆధారపడి ఉంది. దీనిని వైద్య సలహాకు ప్రత్యామ్నాయంగా పరిగణించరాదు. మీకు ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.

మరిన్ని లైఫ్‌స్టైల్ కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us