Parenting Tips: టీనేజ్‌ పిల్లలతో ఫ్రెండ్ షిప్ చేస్తే అన్నీ సెట్ అయిపోతాయి..!

టీనేజ్ దశ పిల్లల జీవితంలో ముఖ్యమైన మలుపు. శారీరకంగా, మానసికంగా, భావోద్వేగంగా ఎన్నో మార్పులు ఎదురవుతాయి. ఈ సమయంలో తల్లిదండ్రులు పిల్లల పట్ల సహనంగా, స్నేహపూర్వకంగా ఉండాలి. వారి భావాలను అర్థం చేసుకొని మార్గ నిర్దేశనం చేస్తే పిల్లలు ధైర్యంగా ఎదుగుతారు.

Parenting Tips: టీనేజ్‌ పిల్లలతో ఫ్రెండ్ షిప్ చేస్తే అన్నీ సెట్ అయిపోతాయి..!
Teenage Emotional Changes

Updated on: May 10, 2025 | 6:17 PM

ప్రతి మనిషి జీవితంలో టీనేజ్ కాలం ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. ఈ దశలో పిల్లల్లో శరీరానికి, మనసుకు, భావాలకు సంబంధించి ఎన్నో మార్పులు జరుగుతాయి. ఈ మార్పుల సమయంలో వారిని సరిగ్గా పెంచడం తల్లిదండ్రులకు నిజంగా కష్టమైన విషయం. కొన్ని సందర్భాల్లో పిల్లలు పెరిగే కొద్దీ వారు బయట ప్రపంచాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం మొదలు పెడతారు. ఈ సమయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా పిల్లలను పరిశీలిస్తూ ఉండాలి.

టీనేజ్ కాలంలో పిల్లలు తామే నిర్ణయాలు తీసుకోవాలనుకుంటారు. తల్లిదండ్రులు ఈ మార్పులను గుర్తించి.. వారి ప్రవర్తనను అర్థం చేసుకోవాలి. ఈ వయస్సులో పిల్లలు ఎక్కువగా ఒంటరిగా మౌనంగా ఉంటారు. ఎవరివద్దనైనా దూరంగా ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రుల శైలిలో మార్పులు అవసరం. వారు మాట్లాడేందుకు సురక్షితంగా అనిపించేలా వాతావరణాన్ని కల్పించాలి.

పిల్లలతో మన సంబంధం మరింత బలపడాలంటే వారు చేసే మార్పులను అర్థం చేసుకోవాలి. వారు ఏదైనా సమస్యతో బాధపడుతూ ఉంటే.. దాని గురించి మిత్రుడిలా మాట్లాడాలి. వాళ్లు ఎటువంటి భయం లేకుండా మనతో మాట్లాడగలగాలి. పిల్లలను చిన్నవారిగా కాకుండా.. వారి భావాలను గౌరవిస్తూ పెద్దవారిలా చూడాలి.

ఈ వయస్సులో పిల్లలు జీవితం మీద సొంత ఆలోచనలు మొదలుపెడతారు. కాని చాలా మంది తల్లిదండ్రులు వాళ్లను నమ్మకపోవచ్చు. వాళ్లు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి వీలు ఇవ్వరు. ఇలా చేయడం వల్ల పిల్లల్లో ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది. పిల్లవాడి భవిష్యత్తు బాగుండాలంటే చిన్న చిన్న నిర్ణయాలు తీసుకునే అవకాశం ఇవ్వాలి. అది పిల్లల ఎదుగుదలకి తోడ్పడుతుంది.

కొంతమంది టీనేజర్లు ఇతరులతో మాట్లాడటంలో వెనకడుగు వేస్తారు. ఎక్కువగా సోషల్ మీడియా లేదా ఫోన్ లోనే గడుపుతారు. ఈ అలవాటు వల్ల వారిలో మౌనం పెరుగుతుంది. అందుకే వారిని నేరుగా ప్రజలతో మాట్లాడేలా ప్రోత్సహించాలి. సమస్యలు వచ్చినా ఎదుర్కొనే ధైర్యం పెరుగుతుంది. కేవలం మాట్లాడటం కాదు.. ఇతరులు మాట్లాడేదాన్ని వినగల నైపుణ్యం కూడా నేర్పాలి. ఏదైనా అంగీకరించకపోతే వినయంగా లేదు అనడం నేర్పించాలి.

పిల్లలు ఎదుగుతున్న సమయంలో తప్పులు చేయడం సహజం. ఆ తప్పుల పట్ల కోపంగా ఉండకూడదు. వీలైనంత మెల్లగా సలహాలు ఇవ్వాలి. ఈ దశలో పిల్లలు దీని గురించి భయపడతారు. అలాంటప్పుడు తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడి వారికి ధైర్యం ఇవ్వాలి.