
భారతదేశంలో పెరిగిపోతున్న సంతానలేమి సమస్యలకు అనేక కారణాలు ఉండవచ్చని నిపుణులు చెప్తున్నారు. ఈ కేసులలో 40-50% పురుషులకు సంబంధించినవి. దీంతో పురుషుల సంతానోత్పత్తి గురించి తరచూ చర్చ జరుగుతోంది. అయితే సంతానం కలగకపోవడానికి శుక్రకణాల సంఖ్య ఒక్కటే కారణం కాకపోవచ్చని కూడా వైద్యులు చెబుతున్నారు.
వై క్రోమోజోమ్‌లో మైక్రోడిలీషన్స్ (ముఖ్యంగా అజూస్పెర్మియా ఫ్యాక్టర్ లేదా AzF జన్యువులో) వంటి జన్యు సంబంధిత అసాధారణతలు శుక్రకణాల ఉత్పత్తిని అడ్డుకుంటాయి. ఇది తక్కువ శుక్రకణాల సంఖ్యకు, అసలు శుక్రకణాలు లేకపోవడానికి దారితీస్తుంది. జన్యు పరీక్షలు దీనిని గుర్తించడంలో సహాయపడతాయి.
అంగస్తంభన సమస్యలు, స్ఖలనం సమస్యలు, తక్కువ లైంగిక కోరిక వంటి పరిస్థితులు సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తాయి. వీటిని తరచుగా సరిగా నిర్ధారించరు. చికిత్స చేయరు. ఈ సమస్యలను ముందుగా గుర్తించి పరిష్కరించడం సహజ గర్భధారణ అవకాశాలను మెరుగుపరుస్తుంది.
ఊబకాయం, పేలవమైన ఆహారం, ఒత్తిడి, ధూమపానం, మద్యం వాడకం వంటి కారకాలు శుక్రకణాల సంఖ్యను మాత్రమే కాదు, వాటి చలనాన్ని, ఆకృతిని, శుక్రకణాల DNA ను కూడా ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. ఆరోగ్యకరమైన జీవనశైలి మార్పులు ఇక్కడ కీలకం.
పురుషులపై భావోద్వేగాలను అణచివేయమని సామాజిక ఒత్తిళ్లు ఉంటాయి. గర్భధారణకు సంబంధించిన ఒత్తిడి భావోద్వేగ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇది సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తుంది. భావోద్వేగ శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వడం, ఒత్తిడిని నియంత్రించుకోవడం చాలా ముఖ్యం.
మధుమేహం, రక్తపోటు వంటి అంతర్లీన ఆరోగ్య సమస్యలు పురుషుల సంతానోత్పత్తిని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. అధిక రక్తంలో చక్కెర శుక్రకణాల చలనాన్ని తగ్గిస్తుంది. DNA దెబ్బతీస్తుంది. ఆకృతికి ఆటంకం కలిగిస్తుంది. రక్తపోటు పునరుత్పత్తి అవయవాలకు రక్త ప్రసరణను, హార్మోన్ల నియంత్రణను ప్రభావితం చేస్తుంది. ఈ ఆరోగ్య సమస్యలను నియంత్రణలో ఉంచుకోవడం సంతానోత్పత్తికి సహాయపడుతుంది.