అబ్రకదబ్ర.. ఒక్క ఆకుతో ఇన్ని లాభలా..? ఉదయాన్నే ఇలా చేస్తే ఆ రోగాలకు ఓం భీం బుష్ అంతే..
భారతీయ సంప్రదాయంలో తమలపాకు విశిష్ట స్థానం కలిగి ఉంది. దీని వెనుక శాస్త్రీయ ఆధారాలున్నాయి. నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పరిశోధనల ప్రకారం, తమలపాకులోని హైడ్రాక్సీ చావికాల్, సైటోకైన్ మిమెటిక్ ప్రొటీన్లు ఫాగోసైటోసిస్ ప్రక్రియను, లింఫోసైట్ల ఉత్పత్తిని పెంచి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. దంత సమస్యలు లేకుండా దీనిని వారానికి ఒకటి, రెండుసార్లు పచ్చిగా తీసుకోవడం ఉత్తమం..

భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) కి ఎనలేని ప్రాముఖ్యత ఉంది. పూజలు, నోములు, వ్రతాలు, కర్మకాండాలు, పెళ్లిళ్లు, శుభకార్యాలు, గృహప్రవేశాలు, శంకుస్థాపనలు వంటి ఏ కార్యక్రమమైనా తమలపాకు లేకుండా జరగదు. అలాగే, విందు భోజనాల అనంతరం కూడా తమలపాకును సేవించే ఆచారం మన భారతీయులలో తరతరాలుగా కొనసాగుతోంది. ఈ సంప్రదాయం వెనుక ఏమి శాస్త్రీయ వాస్తవాలున్నాయో అనేక పరిశోధనలు వెల్లడించాయి. 2010వ సంవత్సరంలో, నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, లక్నో వారు తమలపాకుపై జరిపిన 62 పరిశోధనా పత్రాలను విశ్లేషించి, దాని అనేక ప్రయోజనాలను క్రోడీకరించి అందించారు. తమలపాకు మాక్రోఫేజ్ కణాలలో ఫాగోసైటోసిస్ ప్రక్రియను అద్భుతంగా పెంచుతుందని వారు నిరూపించారు. ఫాగోసైటోసిస్ అంటే ఏమిటంటే, మన శరీరం లోపలికి ప్రవేశించిన వైరస్లు, బ్యాక్టీరియాలను మింగేసి నాశనం చేసే ఒక రక్షణ వ్యవస్థ. ఈ వైరస్లు, బ్యాక్టీరియాలను తినేసి భస్మం చేసే రక్షక కణాలనే మాక్రోఫేజ్ కణాలు అంటారు. రక్త పరీక్షలలో కనిపించే మోనోసైట్లు, సైనిక శిక్షణ అనంతరం మాక్రోఫేజ్‌లుగా రూపాంతరం చెందుతాయి. ఈ మాక్రోఫేజ్ కణాలు వైరస్లు, బ్యాక్టీరియాలను మింగేసి సమర్థవంతంగా తొలగిస్తాయి. ఈ ప్రక్రియను తమలపాకు బాగా యాక్టివేట్ చేస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి.
తమలపాకుల్లో ఎన్నో పోషకాలు..
తమలపాకులో విటమిన్ సి, ఎ, థయామిన్, నియాసిన్, రిబోఫ్లావిన్, కాల్షియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు కలిగి ఉన్న తమలపాకులతో.. ఎన్నో సమస్యలను దూరం చేసుకోవచ్చు.. తమలపాకు జీర్ణక్రియను మెరుగుపరచడంతోపాటు.. నోటి ఆరోగ్యాన్ని పెంచడం, శ్వాసకోశ సమస్యలను (దగ్గు, జలుబు) తగ్గించడం, గాయాలను మాన్పడంలో అద్భుతంగా పనిచేస్తుంది. అయితే.. తమలపాకులను నీటిలో మరిగించి ఆ నీరు తాగడం లేదా..నేరుగా కూడా తినవచ్చు.. ఉదయాన్నే తీసుకోవడం చాలా మంచిదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
తమలపాకులో రసాయన సమ్మేళనాలు
తమలపాకులో ఉండే రెండు ముఖ్యమైన రసాయన సమ్మేళనాలు ఈ రోగనిరోధక శక్తి పెంపుదలకు దోహదపడతాయి. అవి హైడ్రాక్సీ చావికాల్ (Hydroxychavicol), సైటోకైన్ మిమెటిక్ ప్రొటీన్ (Cytokine mimetic protein).. ఈ సమ్మేళనాలు ఎముక మజ్జను (bone marrow) ఉత్తేజపరుస్తాయి. దీని ఫలితంగా టి-లింఫోసైట్‌లు (T-lymphocytes), బి-లింఫోసైట్‌లు (B-lymphocytes) ఉత్పత్తి బాగా పెరుగుతుంది. తమలపాకు సేవించడం వల్ల తెల్ల రక్త కణాలైన లింఫోసైట్ల ఉత్పత్తి పెరగడం, మాక్రోఫేజ్ కణాల ఫాగోసైటోసిస్ సామర్థ్యం మెరుగుపడడం అనే రెండు ప్రక్రియలు ఒకేసారి జరుగుతాయి. ఈ రెండు రసాయన సమ్మేళనాలు ఈ మార్పులకు ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు నిరూపించారు.
ప్రతిరోజు మన శరీరంలోకి కోట్లాది సంఖ్యలో వైరస్లు, బ్యాక్టీరియాలు ప్రవేశిస్తాయి. వీటిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి మన రోగనిరోధక వ్యవస్థ అత్యంత చురుకుగా ఉండాలి. ఈ వ్యవస్థను ఉత్తేజపరచడానికి, చనిపోయిన కణజాలం స్థానంలో కొత్త కణాలు పునరుత్పత్తి అవ్వడానికి తమలపాకు వంటివి అవసరం. అయితే, రోజువారీ కిళ్ళీలుగా తమలపాకును తీసుకోవడం మంచిది కాదు. కిళ్ళీలలో ఉండే రసాయనాల ప్రభావం వల్ల దంతాలు పాడైపోతాయి. కాబట్టి, వారానికి ఒకటి లేదా రెండుసార్లు ప్రత్యేక సందర్భాలలో దీనిని సేవించడం ఉత్తమం. జీర్ణక్రియను మెరుగుపరచడానికి, రోగనిరోధక వ్యవస్థను చురుకుగా ఉంచడానికి తాంబూలం తీసుకోవచ్చు. తమలపాకులను ఒకటి, రెండు లేదా మూడు ఆకులు తీసుకుని, వాటిని కూరగాయల జ్యూస్ చేసుకునేటప్పుడు గ్రైండర్‌లో వేసి గ్రైండ్ చేసుకుని సేవించడం ఒక సరైన మార్గం.
ఈ విధంగా తమలపాకును ఏదో ఒక రూపంలో వారానికి ఒకటి, రెండుసార్లు సేవించడం ద్వారా రక్షణ వ్యవస్థను ఉత్తేజపరచే అద్భుతమైన మెకానిజం శరీరంలో జరుగుతుంది. మన పూర్వీకులు, ఋషులు తమలపాకుకు ఇటువంటి విశిష్ట స్థానాన్ని కల్పించడం వెనుక ఎంతో శాస్త్రీయత ఉందని ఆధునిక శాస్త్రవేత్తలు నిరూపించారు. ఈ సైంటిఫిక్ వాస్తవాలను తెలుసుకోవడం ద్వారా ఈ రోజుల్లో వైరస్లు, బ్యాక్టీరియాలను నాశనం చేసే ఫాగోసైటోసిస్ ప్రక్రియ చురుకుగా జరగడానికి తమలపాకు ఎంతగానో ఉపయోగపడుతుందని గుర్తించవచ్చు. అయితే.. ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే.. ఆరోగ్య నిపుణులను సంప్రదించడం మంచిది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
