నేటి కాలంలో వృద్ధుల్లోనే కాదు యువతలో కూడా కిడ్నీ స్టోన్ సమస్య వేగంగా పెరుగుతోంది. ఇది మూత్రపిండాల పనితీరును ప్రభావితం చేస్తుంది. కిడ్నీ స్టోన్ కారణంగా మూత్రవిసర్జన సమయంలో తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది. కిడ్నీ స్టోన్ వ్యాధిగ్రస్తులు వీలైనంత ఎక్కువ నీరు తాగాలి. నీటి శాతం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. అయితే కిడ్నీలో రాళ్లు ఉన్నవారు బీరు ఎక్కువగా తాగితే రాళ్లు కరిగిపోతాయని చాలామంది నమ్ముతున్నారు. ఈ నానుడి గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ ప్రచారంలో ఉంటుంది. నిజంగానే బీర్ తాగడం వల్ల కిడ్నీలో రాళ్లు కరుగుతాయో లేదో నిపుణుల మాటల్లో ఇక్కడ తెలుసుకుందాం..
కిడ్నీ స్టోన్ సమస్య ఉన్నవారికి బీర్ తాగమని ఏ వైద్యుడు.. ఎప్పుడూ.. సలహా ఇవ్వరు. అలాగే బీర్ తాగడం వల్ల కిడ్నీలో రాళ్లు తొలగిపోవడంలో సహాయపడతాయని ఇంకా ఎటువంటి పరిశోధనలు రుజువు చేయలేదు. శాస్త్రీయ నిర్ధారణ కానందున కిడ్నీ వ్యాధిగ్రస్తులు బీరు వంటి ఆల్కహాలిక్ డ్రింక్స్ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. బీరు తాగితే మూత్రంలో రాళ్లు నయమవుతాయనేది ఉత్త అపోహ మాత్రమే.
ఎవరికైనా కిడ్నీ స్టోన్ సమస్య ఉంటే.. ఇటువంటి వారు బీర్ తాగడం వల్ల మూత్రం వేగంగా ఒంట్లో ఉత్పత్తి అవుతుంది. ఫలితంగా కిడ్నీ వాపు వస్తుంది. ఇది సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. 5 నుంచి 10 శాతం మందికి మాత్రమే కిడ్నీలో రాళ్లకు ఖచ్చితమైన కారణం తెలుసు. కిడ్నీలో రాళ్లు ఎందుకు ఏర్పడతాయో చాలా మందికి తెలియదు. సాధారణంగా తక్కువ నీరు త్రాగే వారు, అధిక ప్రోటీన్ ఆహారం తీసుకునే వ్యక్తులలో ఇతరుల కంటే మూత్రపిండాల్లో రాళ్లు అభివృద్ధి చెందే ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది.
ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాలలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ప్రొటీన్ ఆహారాలు తీసుకున్నప్పుడు కిడ్నీలో కాల్షియం పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. ఇది కిడ్నీ స్టోన్ సమస్యను కలిగిస్తుంది. దీని ప్రకారం కిడ్నీ స్టోన్ సమస్యలను నివారించడానికి ప్రతిరోజూ కనీసం 3 నుంచి 4 లీటర్ల నీరు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ఎక్కువగా ద్రవ రూపంలో ఆహారం తీసుకోవాలని, ఇవి కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని తగ్గిస్తాయని చెబుతున్నారు.