Headphones: గంటల తరబడి హెడ్‌ఫోన్స్ వాడుతున్నారా? సైలెంట్ కిల్లర్స్‌గా మారుతున్న ఇయర్‌ఫోన్స్!

ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో అది లేనిదే నిమిషం గడవదు. ఆఫీసు మీటింగ్స్ అయినా, ప్రయాణాల్లో పాటలు వినాలన్నా, ఏకాంతంగా సినిమాలు చూడాలన్నా అది మన చెవుల్లో ఉండాల్సిందే. అవును.. మనం వాడుతున్న ఆ చిన్నపాటి ఎలక్ట్రానిక్ పరికరం మన జీవితంలో ఒక భాగమైపోయింది.

Headphones: గంటల తరబడి హెడ్‌ఫోన్స్ వాడుతున్నారా? సైలెంట్ కిల్లర్స్‌గా మారుతున్న ఇయర్‌ఫోన్స్!
Headphones

Updated on: Feb 01, 2026 | 6:30 AM

మనం అమితంగా ఇష్టపడే ఆ పరికరమే మన వినికిడి శక్తిని హరించివేస్తోందని మీకు తెలుసా? ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది యువత తెలియకుండానే ఒక పెద్ద ఆరోగ్య సంక్షోభంలోకి వెళ్తున్నారు. మొదట్లో చిన్నగా అనిపించే చెవి నొప్పి.. భవిష్యత్తులో మిమ్మల్ని శాశ్వత మూగజీవిగా మార్చేసే అవకాశం ఉంది. అసలు ఆ పరికరం వల్ల వచ్చే ముప్పు ఏంటి? మన వినికిడి శక్తిని కాపాడుకోవడానికి నిపుణులు ఇస్తున్న సలహాలేంటో తెలుసుకుందాం..

ఈ రోజుల్లో గంటల తరబడి హెడ్‌ఫోన్స్ లేదా ఇయర్‌ఫోన్స్ ఉపయోగించడం సర్వసాధారణం అయిపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ వాడకం పెరగడంతో కాల్స్, మీటింగ్స్ కోసం వీటిని నిరంతరం వాడుతున్నారు. అయితే ఆరోగ్య నిపుణుల హెచ్చరికల ప్రకారం.. అధిక వాల్యూమ్‌లో పాటలు వినడం, నాణ్యత లేని ఇయర్‌ఫోన్స్ వాడటం వల్ల వినికిడి శక్తి క్రమంగా తగ్గుతుంది. చాలామంది మొదటి లక్షణాలను పట్టించుకోరు. కానీ చెవి నొప్పి, చెవి బరువుగా అనిపించడం వంటివి భవిష్యత్తులో వచ్చే పెద్ద సమస్యలకు సంకేతాలు అని గుర్తుంచుకోవాలి.

నిపుణుల సూచనలు..

చెవుల ఆరోగ్యం విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. హెడ్‌ఫోన్స్‌ను ఉపయోగించేటప్పుడు కొన్ని పద్ధతులు పాటించడం తప్పనిసరి. ఎప్పుడూ మితమైన వాల్యూమ్‌లో మాత్రమే శబ్దాలను వినాలి. నిరంతరం హెడ్‌ఫోన్స్ వాడకుండా మధ్య మధ్యలో విరామం తీసుకోవడం వల్ల చెవిలోని సున్నితమైన కండరాలకు విశ్రాంతి దొరుకుతుంది. చెవులకు ఒత్తిడి కలిగించని, మంచి నాణ్యత గల హెడ్‌ఫోన్స్ ఎంచుకోవడం వల్ల ప్రమాద తీవ్రతను తగ్గించవచ్చు. అలాగే చెవులను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి, కానీ పదునైన వస్తువులను చెవిలో పెట్టి శుభ్రం చేయడం వల్ల లోపల ఉండే సున్నితమైన పొర దెబ్బతినే అవకాశం ఉంది.

ఎదురయ్యే సమస్యలు..

చెవుల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టకపోతే అనేక రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వినికిడి లోపం తలెత్తడం ఒక ఎత్తు అయితే.. చెవుల్లో నిరంతరం రింగింగ్ శబ్దం వినిపించడం వంటి సమస్యలు మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తాయి. చెవి లోపల ఇన్ఫెక్షన్లు రావడం, తీవ్రమైన నొప్పి లేదా చెవి బరువుగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవి కేవలం వినికిడికే పరిమితం కాకుండా నిద్రలేమి, ఏకాగ్రత లోపించడం వంటి సమస్యలకు కూడా దారి తీస్తాయి. శబ్దం వల్ల మెదడుపై ఒత్తిడి పెరిగి మానసిక ఆందోళన కూడా పెరిగే అవకాశం ఉంది.

పాటించాల్సిన ముఖ్యమైన రూల్స్..

ఆరోగ్యకరమైన వినికిడి కోసం గంటకు ఒకసారి హెడ్‌ఫోన్స్ తీసేసి కనీసం పది నిమిషాల విరామం ఇవ్వాలి. దెబ్బతిన్న లేదా వైర్లు బయటకు వచ్చిన ఇయర్‌ఫోన్స్ వాడటం వల్ల విద్యుత్ సంబంధిత ప్రమాదాలు కూడా జరగవచ్చు. చెవులను ఎప్పుడూ పొడిగా ఉంచుకోవాలి. స్నానం చేసిన తర్వాత చెవిలోకి నీరు వెళ్లకుండా జాగ్రత్త పడాలి. ఏదైనా అసౌకర్యం లేదా వినికిడిలో తేడా కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే సంబంధిత వైద్యుడిని సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి. టెక్నాలజీ మనకు సౌకర్యాన్ని ఇస్తుంది కానీ మన ఆరోగ్యాన్ని కాదని గుర్తించాలి. పరిమితంగా వాడితే హెడ్‌ఫోన్స్ ఒక అద్భుతమైన పరికరం, అదే పనిగా వాడితే అవి మనల్ని నిశ్శబ్ద ప్రపంచంలోకి నెట్టేస్తాయి.