ప్రస్తుతం ప్రతీ ఒక్కరి జీవితాల్లో స్మార్ట్‌ఫోన్ ఓ భాగమైపోయింది. స్కూలుకి వెళ్లే చిన్నారుల నుంచి రిటైర్డ్ అయిన ఉద్యోగుల వరకు ప్రతీ ఒక్కరూ స్మార్ట్‌ఫోన్‌కు అతుక్కుపోతున్న రోజులివీ. ఉదయం నిద్ర లేవడమే మొదలు స్మార్ట్‌ఫోన్‌ను పట్టుకోవడంతోనే రోజును మొదలు పెడుతున్నారు. ప్రతీ చిన్న పనికి కూడా స్మార్ట్ ఫోన్ వినియోగం అనివార్యంగా మారడం దీనికి ఒక కారణంగా చెప్పొచ్చు. అయితే స్మార్ట్ ఫోన్ వల్ల ప్రయోజనాలు ఉన్నట్లే, అనర్థాలు కూడా ఉన్నాయి. స్మార్ట్ ఫోన్‌ను అతిగా ఉపయోగించడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. మీలో కూడా ఈ లక్షణాలు కనిపిస్తుంటే స్మార్ట్ ఫోన్ ప్రభావం మీపై ఉన్నట్లే. ఇంతకీ ఆ లక్షణాలు ఏంటంటే..
* ఒత్తిడికి కారణమయ్యే కార్టిసాల్ హార్మోన్ స్థాయిలు ఉదయం తక్కువగా ఉంటాయి. అందుకే ఉదయం లేవగానే ఫ్రెష్‌గా ఉంటాయి. అయితే ఉదయం నిద్ర లేవగానే స్మార్ట్‌ఫోన్‌ను పట్టుకుంటే ఒత్తిడి స్థాయి ఒక్కసారిగా పెరుగుతుంది. ఉదయం నిద్రలేవగానే ఒత్తిడిగా ఫీలవుతుంటే స్మార్ట్‌ఫోన్‌ను పక్కన పెట్టాల్సిందేనని గుర్తుంచుకోండి.
* ఏ కారణం లేకుండా తలనొప్పి వస్తుంటే అది కూడా గ్యాడ్జెట్ అతి వినియోగం లక్షణమేనని అర్థం చేసుకోవాలి. గ్యాడ్జెట్‌ల వినియోగం కారణంగా ఒత్తిడికి కారణమయ్యే హార్మోన్లు విడుదలవుతాయి. దీని కారణంగా తలనొప్పి పెరుగుతుంది.
* ఇక గ్యాడ్జెట్ల అతి వినియోగం వల్ల కలిగే దుష్ప్రభాల్లో మెడ నొప్పి ఒకటి. ఎక్కువసేపు ఒకే భంగిమలో కూర్చోవడం అది వెన్నెముకపై ప్రభావం పడుతుంది. దీంతో మెడ నొప్పితో పాటు నడుము నొప్పి వంటి సమస్యలు వేధిస్తుంటాయి.
* గ్యాడ్జెట్లను అతిగా వాడడం వల్ల భుజం నొప్పి వేధిస్తుంటుంది. ఒకే పొజిషన్‌లో గంటలతరబడి కూర్చోవడం, చేతులను పెద్దగా కదిలించకపోవడం కారణంగా ఈ సమస్య వస్తుందని వైద్యులు చెబుతున్నారు. పైన తెలిపిన ఏ లక్షణాలు కనిపిస్తున్నా మీరు గ్యాడ్జెట్లను అతిగా ఉపయోగిస్తున్నారనే అర్థం.
స్మార్ట్‌ఫోన్ వినియోగాన్ని తగ్గించుకోవడానికి కొన్ని చిట్కాలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. బెడ్‌రూమ్‌కు మొబైల్‌లను దూరంగా పెట్టుకోవాలి. రాత్రి పూట నిద్రపోయే సమయంలో స్మార్ట్‌ఫోన్‌లో ఇంటర్‌నెట్‌ను ఆఫ్ చేసి పడుకోవాలి. ఉదయం లేవగానే ఇంటర్‌నెట్‌ను ఆన్ చేయకుండా ముఖ్యమైన పనులను పూర్తి చేసుకున్న తర్వాతే ఫోన్‌ను ఉపయోగించడం అలవాటు చేసుకోవాలి. రోజులో ఫోన్‌ను ఉపయోగించడానికి ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించుకోవాలి. ఆ సమయంలో కాకుండా మరే ఇతర సమయాల్లోనూ ఫోన్‌ను టచ్ చేయకుండా చూసుకోండి. వీటితో పాటు మెడకు సంబంధించిన కొన్ని వ్యాయామాలు చేస్తుండాలి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..