Anti Aging: 150 ఏళ్లు బతకడం పెద్ద కష్టమేమి కాదు.. శాస్త్రవేత్తల ప్రయోగంలో సంచలనం..!

| Edited By: Janardhan Veluru

Jul 22, 2024 | 11:20 AM

మనిషి 130 నుంచి 150 ఏళ్లు బతకడం పెద్ద కష్టామేమి కాదని, త్వరలోనే ఇది నిజం కానుందని చెబుతున్నారు. తాజాగా నిర్వహించిన ఓ పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. పరిశోధకులు చెబుతోన్న ఈ కొత్త యాంటీ ఏజెంగ్ థెరపీ జీవిత కాలాన్ని 25 శాతం పెంచుతుందని చెబుతున్నారు. ఇంతకీ ఏంటీ యాంటీ ఏజింగ్ థెరపీ అసలు పరిశోధనల్లో ఎలాంటి విషయాలు వెల్లడయ్యాయి.?

Anti Aging: 150 ఏళ్లు బతకడం పెద్ద కష్టమేమి కాదు.. శాస్త్రవేత్తల ప్రయోగంలో సంచలనం..!
Anti Aging
Follow us on

ఎక్కువ కాలం జీవించాలనేది ప్రతీ ఒక్కరి కోరిక. అయితే అది ప్రకృతి విరుద్ధమని తెలిసిందే. మనిషికి నిత్య యవ్వనం అందని ద్రాక్షే. ఎప్పటికైనా వృద్ధాప్యం రావాల్సిందే. అయితే ఈ వృద్ధాప్య ఛాయలు రావడాన్ని వాయిదా వేయొచ్చా అంటే కచ్చితంగా అవునని పరిశోధకులు సమాధానం చెబుతున్నారు. సాధారణంగా హిమాలయాల్లో నివసించే స్వామిజీలు వందేళ్లకు పైగా జీవిస్తుంటారని మనం వినే ఉంటాం. అయితే వీటిలో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ, వచ్చే కొన్నేళ్లలో ఇది ప్రతీ ఒక్కరికీ దీర్ఘ ఆయుష్షు సాధ్యం కానుందని పరిశోధకులు చెబుతున్నారు.

ఆయుష్షును పెంచుకునేందుకు మనిషి తరతరాలుగా తహతహలాడుతున్నాడు. ఈ దిశగా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. హ్యూమన్ గ్రోత్ హార్మోన్లను నియంత్రించడం ద్వారా ఆయుష్షును పెంచుకోవచ్చని ఇప్పటికే పలు పరిశోధనలు నిర్థారించాయి. అటు ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, మానసిక ఆరోగ్యంతో ఆయుష్షును కొంత మేర పెంచుకోవచ్చని అందరికీ తెలిసిందే. ఈ విషయంలో జీన్స్ కూడా దోహదపడుతాయి. వృద్ధాప్య ఛాయలను ఆలస్యం చేసేందుకు యాంటి ఏజింగ్ క్రీములు, సీరమ్ కూడా అందుబాటులో ఉన్నాయి.  అయితే మనిషి 130 నుంచి 150 ఏళ్లు బతకడం పెద్ద కష్టామేమి కాదని, త్వరలోనే ఇది నిజం కాబోతోందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. తాజాగా నిర్వహించిన ఓ పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. పరిశోధకులు చెబుతోన్న ఈ కొత్త యాంటీ ఏజెంగ్ థెరపీ జీవిత కాలాన్ని 25 శాతం పెంచుతుందని చెబుతున్నారు. ఇంతకీ ఏంటీ యాంటీ ఏజింగ్ థెరపీ అసలు పరిశోధనల్లో ఎలాంటి విషయాలు వెల్లడయ్యాయి.? లాంటి వివరాలు తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాలి..

Anti Aging

ఎలుకలపై ప్రయోగం..

సింగపూర్‌లోని డ్యూక్‌ ఎన్‌యుఎస్‌ మెడికల్ స్కూల్‌కు చెందిన శాస్త్రవేత్తలు వయసును జయించడంపై పరిశోధనలు నిర్వహించారు. ఈ పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలు ఎలుకలపై ప్రయోగాలు చేశారు. నేచర్‌ అనే జర్నల్‌లో ఇందుకు సంబంధించి వివరాలను పేర్కొన్నారు. ఈ అధ్యయనంలో తేలిన అంశాల ప్రకారం.. ఇంటర్‌లుకిన్-11 (IL11) అనే ప్రోటీన్ ఎలుకలలో వృద్ధాప్యాన్ని ప్రోత్సహిస్తోందని వారు గుర్తించారు. అయితే సరికొత్త చికిత్స విధానం ద్వారా ఈ ప్రోటీన్‌ను నిరోధించారు. దీంతో ఎలుకల్లో జీవిత కాలాన్ని పొడిగించి తాము అనుకున్నది సాధించారు. ఎలుకల వయసు పెరిగే కొద్దీ వాటి అవయవాలు ఎక్కువగా ఈ IL11 అనే ప్రోటీన్‌ను ఉత్పత్తి చేస్తాయని పరిశోధనల్లో తేలింది. రక్త కణాల నిర్మాణం, కొవ్వు నివారణతో పాటు సంతానోత్పత్తికి ఉపయోగపడే ఈ ప్రోటీన్ కాలేయం, పొత్తికడుపులో అవాంఛిత కొవ్వు పేరుకుపోవడానికి, కండరాల బలాన్ని తగ్తిస్తుందని పరిశోధనల్లో తేలింది. త్వరగా వృద్ధాప్యం రావడానికి ఇవే ప్రధాన కారణాలని నిపుణులు చెబుతున్నారు.

తమ ప్రయోగం ద్వారా ఎలుకల ఆయుష్షును సరాసరి 24.9 వారాల పాటు పెంచగలిగినట్లు సింగపూర్ శాస్త్రవేత్తలు వెల్లడించారు. మగ ఎలుకల వయస్సు కంటే 3 వారాలు ఎక్కువగా ఆడ ఎలుకల జీవితకాలాన్ని పొడగించగలిగారు.  ఈ విషయమై అసిస్టెంట్ ప్రొఫెసర్‌ అనిస్సా విడ్జాజా మాట్లాడుతూ.. ఎలుకల్లో వృద్ధాప్య ఛాయలకు కారణమైన ఈ ప్రోటీన్‌ పెరగడాన్ని తాము 2017లో గుర్తించామని తెలిపారు. ఈ పరిశోధనల్లో తేలిన విషయాల ఆధారంగానే ప్రయోగాత్మక యాంటీ-ఐఎల్ 11 థెరపీని అభివృద్ధి చేయడానికి దారితీసింది. ఈ యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్‌ ద్వారా ఎలుకలలో జీవక్రియను మెరుగుపరిచింది, హానికరమైన తెల్లని కొవ్వును , గోధుమ కొవ్వుగా మారుస్తుంది, ఇది కేలరీలను బర్న్ చేయడంతో పాటు శరీర ఉష్ణోగ్రతను నిర్వహించడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

Anti Aging

అలాగే పరిశోధకులు చేపట్టిన ఈ చికిత్స ద్వారా కండరాల పనితీరుతో పాటు మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరిచింది. దీంతో ఎలుకల జీవితకాలం 5% వరకు పొడిగించింది. యాంటీ IL11 చికిత్స మానవుల్లోనూ వృద్ధాప్య లక్షణాలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. గుండె జబ్బులు, కండరాల బలహీనత వంటి సమస్యలను త్వరగా దరిచేరకుండా చూస్తుంది. ఈ యాంటీ ఏజింగ్ థెరపీ ద్వారా శరీరంలో శక్తిని ఉత్పత్తి చేసే మైటోకాండ్రియా ఆరోగ్యాన్ని రక్షిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ చికిత్స విధానాన్ని మనుషుల్లోనూ అమలు చేయాలనేదే తమ లక్ష్యమని, దీంతో ప్రజలు ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించేందుకు అవకాశం లభిస్తుందని చెప్పారు. సింగ్‌హెల్త్ డ్యూక్-NUS ప్రొఫెసర్ స్టువర్ట్ కుక్‌ చెప్పుకొచ్చారు. అయితే ఇలాంటి వృద్ధాప్య సంబంధిత చికిత్సలకు ఆమోదం లభించడం, నిధులు అందడం అంత సులభమైన విషయం కాదని, ఎన్నో సవాళ్లతో కూడుకున్న అంశమని ఆయన తెలిపారు.

అన్ని పరిశోధనలను పూర్తి చేసుకుని ఈ చికిత్సా విధానం అందుబాటులోకి వస్తే మానవుల ఆయుష్షును కనీసం 25-30 శాతం పెంచే అవకాశముంది. ఇది నిజమైతే భవిష్యత్తులో మనిషి 130 నుంచి 150 ఏళ్ల వరకు జీవించడం పెద్ద కష్టం కాకపోవచ్చు. వయస్సును జయించేందుకు జరుగుతున్న పరిశోధనల్లో ఇది కీలక ముందడుగుగా అంతర్జాతీయ మీడియా వర్గాలు కొనియాడుతున్నాయి.

Anti Aging

ఫుడ్స్‌ కూడా..

తీసుకునే ఆహారం కూడా వయసును తగ్గిస్తుందని ఇప్పటికే పలు అధ్యయనాల్లో స్పష్టమైంది. కొన్ని రకాల ఫుడ్స్‌ను ఆహారంలో భాగం చేసుకుంటే త్వరగా వృద్ధాప్యం రాదని నిపుణులు తెలిపారు. వీటిలో ప్రధానమైన వాటిలో బొప్పాయి ఒకటి. సహజంగా చర్మాన్ని ఎక్కువ కాలం యవ్వనంగా ఉంచడంలో బొప్పాయి కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులోని పపైన్, విటమిన్ సి, ఫోలేట్, విటమిన్ ఎ, మెగ్నీషియం, పొటాషియం, రాగి, విటమిన్ కెలు చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఇక గుమ్మడి గింజలు యాంటీఆక్సిడెంట్లు, జింక్‌లు చర్మ సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. ఎక్కువ కాలం యవ్వనంగా ఉండడంలో గోధుమ గడ్డి రసం కూడా ఉపయోగపడుతుంది. గోధుమ గడ్డిలో క్లోరోఫిల్ శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంది.

Anti Aging

ఇవి వృద్ధాప్య వ్యాధుల నుంచి రక్షించడానికి ఉపయోగపడతాయి. కొబ్బరి నీళ్లు కూడా చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో ఉపయోగపడుతుంది. వృద్ధాప్యాన్ని నిరోధించే లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులోని విటమిన్ సి చర్మాన్ని కాంతివంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. కొబ్బరి నీళ్లలోని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కొల్లాజెన్ సంశ్లేషణను ప్రేరేపిస్తుంది. కొబ్బరి నీరు చర్మం స్థితిస్థాపకతను మెరుగుపరచడం ద్వారా మృదువుగా ఉంచడంలో సహాయపడుతుంది. చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో అవిసె గింజలు ఉపయోగపడుతాయి. శరీరంలో శరీరంలో కొల్లాజెన్‌ను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. ముడతలు, అకాల వృద్ధాప్యం వంటి లక్షణాలను తగ్గిస్తుంది. సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం, పొగతాగడం, ఎక్కువ సమయం ఎండలో గడపడం, శరీరక వ్యాయామం లేకపోవడం, నిత్యం మానసిక ఒత్తిడిని ఎదుర్కోవడం వంటి కారణాలతో వృద్ధాప్య ఛాయలు యుక్తవయస్సులోనే వస్తాయి.

వాస్తవానికి వృద్ధాప్య ఛాయలను ఆలస్యం చేసేందుకు పలు పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ విషయంలో జపనీయులు ముందు వరుసలో ఉన్నారని చెప్పొచ్చు. వారు తమ జీవన శైలి, ఆహారపు అలవాట్లు, కంటినిండా నిద్ర‌తో తమ ఆయుష్షును పెంచుకోవడంలో విజయవంతం అవుతున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..