Mutton: మటన్ అంటేనే మంచిది.. ప్రతి పార్టూ పవర్‌ఫులే.. ఇది తెలిస్తే మరొకటి ముట్టుకోరు

మటన్ లివర్, కాళ్లు, తలకాయ, బోటీ వంటి వివిధ భాగాలలో ఐరన్, విటమిన్ B12, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. రక్తహీనతను తగ్గించి, ఎముకలను బలోపేతం చేసి, రోగనిరోధక శక్తిని పెంచి, ప్రేగుల ఆరోగ్యానికి ఇవి మేలు చేస్తాయి. మటన్‌ను సరైన పద్ధతిలో వండుకుని వారానికి ఒకసారి తీసుకోవడం ఆరోగ్యకరమని నిపుణులు చెబుతున్నారు.

Mutton: మటన్ అంటేనే మంచిది.. ప్రతి పార్టూ పవర్‌ఫులే.. ఇది తెలిస్తే  మరొకటి ముట్టుకోరు
Mutton

Updated on: Feb 09, 2026 | 1:04 PM

మాంసాహార ప్రియులకు మటన్ ఒక ప్రత్యేకమైన ఎంపిక. చికెన్ లేదా ఫిష్ బిర్యానీలతో పోలిస్తే మటన్ బిర్యానీకి గిరాకీ ఎప్పుడూ ఎక్కువేగానే ఉంటుంది. ఫంక్షన్లు లేదా పార్టీలలో మటన్ లేకపోతే ఆ విందు అసంపూర్ణంగా భావిస్తారు. అయితే మటన్ కేవలం రుచిని మాత్రమే కాకుండా, శరీరానికి కావాల్సిన అనేక పోషకాలను కూడా అందిస్తుంది. మటన్ లోని ప్రతి భాగం దానిదైన ప్రత్యేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. మటన్ లివర్, బోటి, కాళ్లు, మేక తలకాయ, దబ్బ ఇలా అన్నీ ప్రత్యేకమైనవే.. వీటిని ఇష్టంగా కూరగా, ఫ్రైగా వండుకుని తింటారు. వీటిలో అనేక పోషకాలు దాగున్నాయి.. ఇవి శరీరానికి ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తాయి..

మటన్ లివర్, పాయా, బోటి ప్రయోజనాలు ఇవే..

మటన్ లివర్: మటన్ లివర్‌లో ఐరన్, విటమిన్ B12 వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని వారాంతపు నాన్ వెజ్ ఆహారంలో చేర్చుకోవడం వలన రక్తహీనతను సమర్థవంతంగా తగ్గించవచ్చు. అంతేకాకుండా, శరీర ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచడంలో కూడా ఇది సహాయపడుతుంది.

మేక కాళ్ళు: మేక కాళ్ళతో తయారుచేసే సూప్ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఈ సూప్ తాగడం వలన అంటువ్యాధులు రాకుండా నిరోధించవచ్చు. జలుబు లేదా ఎముకల బలహీనత వంటి సమస్యలతో బాధపడేవారు మటన్ బోన్ సూప్ తాగితే మంచి ఫలితాలను పొందుతారు. ఇది హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడంలో సహాయపడి, ఎముకలను బలోపేతం చేస్తుంది.

మేక తలకాయ: మేక తలకాయలో కొవ్వు శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ, ఐరన్, ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి. సాధారణంగా దీనిని కాల్చి, ముక్కలుగా చేసి కూర వండుకుని చపాతీ లేదా అన్నంతో తింటుంటారు. రెడ్ మీట్ అంతగా ఇష్టపడని వారికి ఇది ఒక మంచి ప్రత్యామ్నాయం. తలకాయ కూరను తినడం వలన శరీరం మరింత గట్టిపడుతుంది.. కావలసిన శక్తిని పొందుతుంది.

మటన్ బోటీ (పేగులు): మటన్ బోటీ, అంటే మేక పేగులు, రకరకాల పోషకాలను కలిగి ఉంటాయి. వీటిలో విటమిన్ ఎ, బి12, డి, ఇ, కె వంటి ముఖ్యమైన విటమిన్లు ఉంటాయి. మటన్ బోటీని కూరగా వండుకుని లేదా ఫ్రై చేసుకుని తినడం వలన ప్రేగుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇది జీర్ణవ్యవస్థకు మేలు చేయడమే కాకుండా, శరీర రోగనిరోధక శక్తిని గణనీయంగా పెంచుతుంది.

మటన్ కూరతోనే..

మటన్ ప్రయోజనాలను పొందడానికి, వారానికి ఒకసారి దీనిని ఆహారంలో భాగంగా చేసుకోవచ్చు. అయితే, మటన్‌ను వేయించడం లేదా గ్రిల్ చేయడం వంటి పద్ధతుల వలన కొవ్వు శాతం పెరుగుతుంది. కాబట్టి, సాధారణంగా వండుకుని తినడం వలన అందులో ఉండే విటమిన్లు, పోషకాలు సంపూర్ణంగా శరీరానికి అందుతాయి. ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం సమతుల్య ఆహారంలో మటన్‌ను చేర్చడం మంచిది. కానీ.. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు తక్కువగా తీసుకోవడం ఉత్తమం..

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..