
చాలామంది ఎక్కువ జీతం లేదా ఆదాయం వస్తేనే ధనవంతులు కాగలమని భావిస్తుంటారు. కానీ, నిజానికి సంపన్నులు కావడం అనేది మీరు ఎంత సంపాదిస్తున్నారనే దానికంటే, వచ్చిన డబ్బును ఎలా నిర్వహించారనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ సిఏ అఖిల్ కంచర్ల అభిప్రాయం ప్రకారం, సంపన్నులు పాటించే కొన్ని ముఖ్యమైన ఆర్థిక అలవాట్లు వారిని సాధారణ వ్యక్తుల కంటే ఎంతో ముందు వరుసలో నిలబెడతాయి.
ధనవంతులు ఎల్లప్పుడూ తమ జేబులోకి డబ్బును తెచ్చిపెట్టే ఆస్తులు ఉదాహరణకు స్టాక్స్, రియల్ ఎస్టేట్, మ్యూచువల్ ఫండ్స్ పై దృష్టి పెడతారు. కానీ, సాధారణ ప్రజలు కార్లు, ఖరీదైన గ్యాడ్జెట్లు వంటి సమయంతో పాటు విలువ తగ్గే వస్తువులపై ఎక్కువ ఖర్చు చేస్తారు.
శ్రీమంతులు చిన్న వయస్సులోనే పెట్టుబడులు పెట్టడం ప్రారంభిస్తారు. చక్రవడ్డీ ద్వారా సుదీర్ఘకాలంలో స్వల్ప మొత్తాలు కూడా భారీ సంపదగా మారతాయని వారు నమ్ముతారు. లాభాలను మళ్లీ రీ-ఇన్వెస్ట్ చేయడం వీరి ప్రధాన అలవాటు.
సాధారణంగా చాలామంది ఆదాయం వచ్చిన తర్వాత ఖర్చులు చేసి మిగిలినదాన్ని పొదుపు చేస్తారు. కానీ, ధనవంతులు ఆదాయం రాగానే ముందుగా తమ లక్ష్యాలకు సరిపడా పెట్టుబడులను పక్కనబెట్టి, ఆ తర్వాత మిగిలిన దాంతోనే నెలవారీ ఖర్చులను ప్లాన్ చేస్తారు.
ఆర్థిక సంక్షోభాలు లేదా ఉద్యోగ భద్రత లేని సమయంలో ఇబ్బంది పడకుండా ఉండటానికి కనీసం 6 నెలల ఖర్చులకు సరిపడా అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకుంటారు. అలాగే ఆరోగ్య, జీవిత భీమా తీసుకోవడం ద్వారా తమ సంపదను కాపాడుకుంటారు.
డబ్బును నిర్వహించడంలో నిరంతరం కొత్త విషయాలు నేర్చుకోవడం చాలా అవసరం. పన్ను ఆదా మార్గాలు, ద్రవ్యోల్బణాన్ని అధిగమించే మార్గాలపై సంపన్నులు నిరంతరం దృష్టి సారిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ, సరైన ప్లానింగ్, ఓర్పు ఉంటే ఎవరైనా సులభంగా ఆర్థిక స్వేచ్ఛను సాధించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..