
డాక్టర్ జెరెమీ లండన్ ప్రకారం, ఒక మనిషి తన శరీరానికి చేసుకునే అతిపెద్ద నష్టం ఏదైనా ఉందంటే అది సిగరెట్ తాగడమే. మెల్ రాబిన్స్ పాడ్‌కాస్ట్‌లో ఆయన మాట్లాడుతూ, నికోటిన్ వ్యసనం నుండి బయటపడటం కష్టమని తనకు తెలుసని, కానీ అది కలిగించే అనర్థాలు అంతకంటే భయంకరమని హెచ్చరించారు. రక్తనాళాలు చిట్లిపోవడం నుండి గుండెపోటు వరకు.. ఒక సిగరెట్ మీ అవయవాలను ఎలా చిన్నాభిన్నం చేస్తుందో తెలుసుకుందాం..
1. లిస్టులో టాప్ వన్, టూ, త్రీ ఇదే:
ప్రమాదకరమైన అలవాట్ల జాబితాలో ధూమపానం మొదటి మూడు స్థానాల్లో ఉంటుందని డాక్టర్ జెరెమీ అభిప్రాయపడ్డారు. “శరీరంలోని ప్రతి అవయవానికి ధూమపానం చేసినంత నష్టం మరేదీ చేయదు” అని ఆయన కుండబద్దలు కొట్టారు.
2. ఎందుకు ఇంత ప్రమాదకరం?
సిగరెట్లలోని రసాయనాలు రక్తనాళాలను దెబ్బతీస్తాయి, రక్తంలో ఆక్సిజన్ శాతాన్ని తగ్గిస్తాయి. గుండెపై విపరీతమైన ఒత్తిడిని కలిగిస్తాయి. ఇది కేవలం ఊపిరితిత్తుల క్యాన్సర్‌కే కాదు, స్ట్రోక్ గుండె జబ్బులకు ప్రధాన కారణం.
3. శరీర వ్యవస్థపై ప్రభావం (2023 అధ్యయనం):
క్యురియస్ (Cureus) జర్నల్ ప్రచురించిన అధ్యయనం ప్రకారం, ధూమపానం శ్వాసకోశ వ్యవస్థ, హృదయనాళ వ్యవస్థ మరియు సంతానోత్పత్తి సమస్యలకు దారితీస్తుంది. ఇది కేవలం తాగే వారికే కాదు, పక్కన ఉన్న వారికి (Passive Smoking) కూడా అంతే ప్రమాదకరం.
4. సర్జన్ సలహా:
నికోటిన్ బానిసల కష్టాలను తాను అర్థం చేసుకోగలనని, కానీ ఆరోగ్యం దృష్ట్యా దీనిని మానుకోవడమే మీరు మీకు ఇచ్చుకునే గొప్ప బహుమతి అని డాక్టర్ జెరెమీ సూచించారు. క్లిష్టమైన సర్జరీల కంటే ధూమపానం మానడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలే ఎక్కువని ఆయన స్పష్టం చేశారు.
గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే. సంస్థ దీనికి బాధ్యత వహించదు. ధూమపానం మానుకోవాలనుకునే వారు వైద్య నిపుణుల సలహాతో ‘నికోటిన్ రీప్లేస్‌మెంట్ థెరపీ’ వంటి పద్ధతులను అనుసరించవచ్చు.