ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతులకు అమలుచేస్తున్న అద్భుతమైన పథకాలు చూసి చంద్రబాబుకి ఏమీ పాలుపోవడంలేదన్నారు వైసీపీ సీనియర్ నేత, మంత్రి బొత్స సత్యనారాయణ. ఇవన్నీ చూస్తున్న టీడీపీ అధినేత తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారంటూ అమరావతిలో సెటైర్లు వేశారు. విద్యుత్ చార్జీల నగదు బదిలీపై గగ్గోలు పెడుతున్న చంద్రబాబు ఎన్నికలకు ముందు నగదు బదిలీని గొప్పగా చెప్పలేదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో పగటిపూట 9 గంటలు ఉచిత విద్యుత్ ఇవ్వాలని నిర్ణయించామని.. ఈ పథకాన్ని ఇంకా మెరుగ్గా అమలు చేసేందుకు అధికారుల నుంచి అన్ని వివరాలు తీసుకొన్నాకే ఈ నిర్ణయానికి వచ్చామన్నారు. అనధికార విద్యుత్ కనెక్షన్లను కూడా క్రమబద్దీకరిస్తున్నామన్నారు. పంపుసెట్లకు విద్యుత్ మీటర్ల ఖర్చు కూడా ప్రభుత్వమే భరిస్తుందన్నారు. రైతులు ఒక్క పైసా కట్టక్కర్లేదని బొత్స వెల్లడించారు. ఉచిత విద్యుత్‌ను వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించారని.. ఈ పథకం అమల్లో ఎన్నటికీ వెనుతిరగమని బొత్స స్పష్టం చేశారు.