సీఏఏకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నవారిపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘అగర్ కోయీ మర్ నే కే లియే ఆహీ రహా హైతో ఓ జిందా కహాసే హో జాయెగా ‘ (తన చావు కోరి ఎవరైనా వస్తే ఆ వ్యక్తి ఎలా బతికి ఉంటాడు) అని ఆయన వివాదాస్పద కామెంట్లు చేశారు. బుధవారం రాష్ట్ర అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. సీఏఏకు నిరసనగా గత డిసెంబరులో జరిగిన అల్లర్లలో సుమారు 20 మంది మృతి చెందిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఈ అల్లర్లలో పోలీసుల తూటాలకు ఎవరూ మరణించలేదన్నారు. ఒకరిని షూట్ చేయాలనే ఉద్దేశంతో మరొకరు వీధిలోకి వస్తే.. అతడైనా చావాలి.. లేదా ఆ పోలీసైనా మరణించాలి అని ఆయన వ్యాఖ్యానించారు. సవరించిన పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా గత నెలరోజులుగా యూపీలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. లక్నో, కాన్పూర్, ప్రయాగ్ రాజ్ ప్రాంతాల్లో నిరసనలు ఇప్పటికీ సాగుతున్నాయి. ‘స్వేఛ్చ కోసం వీరంతా నినాదాలు చేస్తున్నారు.. కానీ స్వేఛ్చ అంటే ఏమిటి? మహమ్మద్ అలీ జిన్నా కోసం మనం పని చేస్తున్నామా లేక గాంధీజీ ఆశయ సాధనకోసమా ‘ అని యోగి ప్రశ్నించారు. డిసెంబరులో జరిగిన హింసాత్మక ఘటనలు, అల్లర్ల తరువాత రాష్ట్రంలో ఎలాంటి హింస జరగలేదని, ఇందుకు పోలీసులను అభినందిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ఆందోళనకారులను నేనేమీ అనడం లేదని, అయితే హింసను రెచ్ఛగొట్టేవారినే టార్గెట్ చేస్తున్నానని ఆదిత్యనాథ్ అన్నారు. ఇలా ఉండగా.. సీఏఏను వ్యతిరేకిస్తూ బిజ్నూర్ జిల్లాలో జరిగిన అల్లర్లలో… తమ కాల్పుల్లో ఒకరు మరణించారని ఆ మధ్య పోలీసులు అంగీకరించిన విషయం గమనార్హం.