హైదరాబాద్ పాతబస్తీలో పేదింటి ఆడపిల్లలు అంగట్లో బొమ్మలవుతున్నారు. ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లాలనుకునే మహిళల అవసరాన్ని ఆసరగా చేసుకుని నకిలీ ఏజెంట్లు రెచ్చిపోతున్నారు. కాంటాక్ట్ మ్యారేజీలు ఓ వైపు ఉపాధి కోసమని చెప్పి వ్యభిచారం రొంపిలోకి పంపే ముఠాలు ఓ వైపు మొత్తంగా పాతబస్తీ మహిళలు, యువతులు అరబ్ షేక్ ల చేతికి చిక్కి విలవిలల్లాడుతున్నారు. తాజాగా పాతబస్తీకి చెందిన ఐదుగురు మహిళలను ఉపాధి కోసం ఓ ఏజెంట్ అరబ్ షేక్ కు అమ్మిన ఘటన వెలుగు చూసింది. పాతబస్తీలో పేదరికకం కారణంగా మహిళలు ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లటం సర్వసాధారణ విషయం. ప్రతీ యేటా పెద్దమొత్తంలో మహిళలు ఉపాధి పేరిట గల్ఫ్ దేశాలకు తరలించబడ్తున్నారు. ఏజెంట్స్ ఏదో పని పేరు చెప్పి గల్ఫ్ దేశానికి విజిట్ వీసా ద్వారా మహిళలను తరలిస్తారు. అందుకుగాను మహిళలనుండి డబ్బులు కమీషన్ పేరుతో డబ్బులు తీసుకుంటారు. ఇక వీరు గల్ఫ్ కు వెళ్లే వరకు కూడా తాము మోసం పోయినట్లు తెలియదు.
తాజాగా వెలుగు చూసిన ఘటనలో షఫీ అనే ఏజెంట్ షాప్ కీపింగ్ పని పేరుతో ఐదుగురు మహిళలను విజిట్ వీసా పై దుబాయ్ కి పంపాడు. అయితే సదరు ఏజెంట్ ఐదుగురు మహిళలను ఒక్కొక్కరిని రెండు లక్షల చొప్పున అరబ్ షేక్ కు అమ్మినట్లు బాధిత మహిళలు గుర్తించారు. షేక్ ల చేతిలో నిత్యం నరకం అనుభవిస్తున్నామని జరిగిన విషయాన్ని తమ కుటుంబ సభ్యులకు తెలియజేయటంతో ఈ దారుణం వెలుగు చూసింది. దీంతో కుటుంబ సభ్యులు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేశారు. తమ వారికి అరబ్ షేక్ ల చెర నుంచి విముక్తి కల్పించాలని కోరారు. అయితే..ఇలాంటి దారుణాలు నిత్యం వెలుగు చూస్తున్నా నకిలీ ఏజెంట్ల విషయంలో మాత్రం పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. ఇక ఇదంతా మానవ అక్రమరవాణా కిందికి వస్తుందని ఇలాంటి వారిపై కఠినంగా వ్యవహరించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.