Woman Attempted Suicide: అప్పు తీసుకున్న వ్యక్తి డబ్బులు చెల్లించడంలేదని ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన సంఘటన ఖమ్మం జిల్లా వైరాలో చోటుచేసుకుంది. బాధితురాలి వివరాల ప్రకారం.. తన తండ్రి చావుబతుకుల్లో ఉన్నాడని చెప్పి భానోతు సరోజిని దగ్గర భుక్యా బాలాజీ అనే వ్యక్తి రూ.4లక్షలు అప్పుగా తీసుకున్నాడు. రోజులు గడుస్తున్నకొద్దీ బాలాజీ అప్పు చెల్లించలేదు. దీంతో నెల క్రితం సరోజిని డబ్బుల కోసం నిలదీయగా ఇంటిని అమ్మేసి అప్పు తీరుస్తానని హామి ఇచ్చాడు. అయితే ఇక్కడే అసలు కథ మొదలైంది.
అనుకున్నట్లుగానే ఇల్లు అమ్మేసిన బాలాజీ తీసుకున్న డబ్బులు మాత్రం సరోజినికి ఇవ్వడం లేదు. అప్పు ఇచ్చిన డబ్బుల కోసం నరకం చూపిస్తున్నాడు. వడ్డీ అవసరం లేదని, రెక్కలు ముక్కలు చేసి కూడబెట్టిన డబ్బులని, అసలు ఇచ్చినా సరిపోతుందని అడిగినా అతడి మనసు కరగలేదు. అయితే బాలాజీ అమ్మిన ఇంటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఉండటంతో తన తల్లితో కలిసి సరోజిని వైరాలోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి చేరుకుంది. తనకు న్యాయం జరడం లేదని చెబుతూ ఒంటికి నిప్పు అంటించుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. అక్కడున్నవారు అడ్డుపడి పోలీసులకు సమాచారం అందించారు. కానీ పోలీసులకు ఇదివరకే ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదని సరోజిని ఆవేదన వ్యక్తం చేసింది.