అమ్మగా మారడం ప్రతి మహిళ జీవితంలో బెస్ట్ మూమెంట్ అని చెప్పాలి. రక్త, మాంసాలు పంచి..మరో జీవికి ప్రాణం పోసే శక్తి మహిళకు మాత్రమే ఉంది. ఒకవేళ ఎవరికైనా పిల్లలు త్వరగా అందకపోతే వారు వెళ్లని ఆలయం ఉండదు. సంప్రదించని డాక్టర్ ఉండడు. మాతృత్వం కోసం ఇరుగుపొరుగువారు, తెలిసినవారు ఏది చెబితే అది ఫాలో అవుతారు. అప్పటికీ పిల్లలు కలగకపోతే వారి మనోవేదన వర్ణించవీలులేనిది. తాజాగా ఓ మహిళకు వివాహమై ఏళ్లు గడుస్తున్నా.. సంతానం కలగలేదు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ఆమె బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఆదివారం వెలుగుచూసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కగ్గుపోతు తిరుపతమ్మ(32), పోతురాజు దంపతులు విజయవాడ సిటీలోని జక్కంపూడికాలనీలో నివాసం ఉంటున్నారు. వారికి 2003లో పెళ్లైంది. పోతురాజు పానీపూరీ వ్యాపారం చేస్తుండగా, తిరుపతమ్మ కుమ్మరిపాలెం సెంటరులోని ఓ చిన్న సంస్థలో ప్యాకింగ్ పని చేస్తుంటుంది. ఆమె వివాహమైన రెండో సంవత్సరం నుంచి పిల్లలు పుట్టడం లేదని బాధ పడుతూ ఉండేది. సంతానం కోసం వారు పలువురు డాక్టర్లను సంప్రదించడంతో పాటు దేవుళ్లకు కూడా ముడుపులు కట్టారు. కానీ ఫలితం లేదు. తాను ఇక అమ్మ కాలేనని ఆవేదనతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది. 12వ తేదీ శనివారం పని ముగించుకోని ఇంటికి వస్తూ..పానీపూరి వ్యాపారం చేసే భర్త వద్దకు వెళ్లి..ఇంటికి వెళుతున్నట్లుగా చెప్పి వెళ్లింది. ఆయన వ్యాపారం ముగించుకోని రాత్రి ఇంటికి వెళ్లేసరికి ఇంటికి తలుపులు వేసి ఉన్నాయి. వాటిని ఎంత కొట్టినా తీయకపోవడంతో చుట్టు పక్కల వారి సాయంతో తలుపులు బద్దలు కొట్టి ఆమె చీరతో ఫ్యాన్‌కి ఉరివేసుకొని ఉంది. సమాచారం అందుకున్న టూ టౌన్ పోలీసులు అక్కడకు చేరుకొని శవపంచనామా నిర్వహించి మృతదేహాన్ని గవర్నమెంట్ ఆస్పత్రికి తరలించారు. ఆదివారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Also Read :