Uttarakhand joshimath Dam News: ఉత్తరాఖండ్ లో ఆదివారం సంభవించిన ప్రకృతి వైపరీత్యానికి కారణాలు ఎన్నో కనిపిస్తున్నాయి. మెరుపు వరదలకు చమోలీ జిల్లాలోని రిషిగంగా పవర్ ప్రాజెక్టు భారీగా దెబ్బ తినడంతో ఈ ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో ఉన్న 100 మంది నుంచి 150 మంది కార్మికులు కొట్టుకుపోయినట్టు తెలుస్తోంది. తపోవన్ ఏరియాలోని గ్లేసియర్ విరిగిపడడమే (ఔట్ బరస్ట్ ) ఇందుకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. అసలు గ్లేసియర్ ఔట్ బరస్ట్ అంటే ? గ్లేసియర్ లేదా మొరైన్ అంటే మంచుతో కూడిన రాతి సమూహాలు, మట్టితో నిండిన ఉపరితలాలు…ఐస్ తో బాటు సమీప నదుల నుంచి కొట్టుకు వచ్చిన రాళ్లు, మట్టి వంటివి ఇందులో భాగం.. ఆకస్మిక వరదలు సంభవించినప్పుడు ఈ సమూహాలన్నీ ఒక్కసారిగా ‘పేలిపోతాయి’. దీన్నే ఒకవిధంగా ఔట్ బరస్ట్ అంటారు. నీటి ఒత్తిడి, ప్రవాహం పెరిగిపోయినప్పుడు మంచుతో కూడిన హిమ శిఖరాలు లేక కొండ చరియలు విరిగిపడినప్పుడు లేదా మంచు ప్రాంతాలకింద భూప్రకంపనలు సంభవించినప్పుడు ఈవిధమైన పరిణామాలు ఏర్పడతాయి.
గ్లేసియర్ లో కోట్లాది మిలియన్ క్యూబిక్ మీటర్ల నీరు నిండి ఉంటుంది. మంచును గానీ, గ్లేసియర్ సెడిమెంట్ ను గానీ కంట్రోల్ చేయలేకపోయినప్పుడు విడుదలయ్యే నీరు కొన్ని నిముషాలపాటు లేదా కొన్ని గంటలపాటు, లేదా కొన్ని రోజులపాటు ఉంటుంది. ఒక్కోసారి నీరు కొన్ని నిముషాలకే తగ్గిపోయి అక్కడ యధాతథ పరిస్థితి ఏర్పడుతుంది. మరికొన్ని సందర్భాల్లో నీరు ప్రవాహంలా వేగంగా పారుతుంది. దీంతో సమీప ప్రాంతాలు జలమయమైపోతాయి.