హైదరాబాదీల ఆల్‌రౌండ్ విజయం

సన్​రైజర్స్​ హైదరాబాద్​ అదరగొట్టింది. దుబాయ్​ వేదికగా జరిగిన మ్యాచ్​లో దిల్లీ క్యాపిటల్స్​ను చిత్తుగా ఓడించి 88 పరుగులు తేడాతో ఘన విజయం సాధించింది...

హైదరాబాదీల ఆల్‌రౌండ్ విజయం
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Oct 28, 2020 | 12:54 PM

Sunrisers Hyderabad Win : సన్​రైజర్స్​ హైదరాబాద్​ అదరగొట్టింది. దుబాయ్​ వేదికగా జరిగిన మ్యాచ్​లో దిల్లీ క్యాపిటల్స్​ను చిత్తుగా ఓడించి 88 పరుగులు తేడాతో ఘన విజయం సాధించింది.

ప్లేఆఫ్‌ రేసులో నిలవాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మెరిసింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ షోతో సత్తా చాటుకుంది. కొండంత టార్గెట్ ఛేదనలో యువ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ (3/7), సందీప్‌ శర్మ(2/27) ధాటికి ఢిల్లీ 131 పరుగులకే ఆలౌటైంది. దీంతో సన్‌రైజర్స్‌ 88 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ఢిల్లీకి ఓటమిని మూటగట్టుకుంది.

రషీద్‌ ఈ సీజన్‌లోనే అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు (4-0-7-3) నమోదు చేశాడు. రిషబ్‌ పంత్‌(36: 35 బంతుల్లో 3ఫోర్లు, సిక్సర్‌) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఆరంభంలో రహానె (26) ఫర్వాలేదనిపించగా మిగతా బ్యాట్స్‌మెన్‌ దారుణంగా విఫలమయ్యారు. హైదరాబాద్‌ బౌలర్ల దెబ్బకు బ్యాట్స్‌మెన్‌ వరుసగా ఇంటిదారి పట్టారు. ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లేఆఫ్‌ బెర్తు ఖాయం చేసుకోవాలని భావించిన ఢిల్లీకి రషీద్ రూపంలో నిరాశే ఎదురైంది.

అంతకుముందు టాస్ ఓడిపోయి బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్‌ వార్నర్ 34 బంతుల్లో 8ఫోర్లు, 2సిక్సర్లతో 66 పరుగులను చేశాడు. వార్నర్‌తో చెతులు కలిపిన వృద్ధిమాన్‌ సాహా 45 బంతుల్లో 12ఫోర్లు, 2సిక్సర్లతో 87 చేసి జట్టు విజయానికి కారణంగా మారాడు. ఓపెనర్లు సునామిలా విరుచుకుపడటంతో సన్‌రైజర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 219 పరుగులు చేసింది. ఆఖర్లో మనీశ్‌ పాండే కూడా తనదైన స్థాయిలో రెచ్చిపోయాడు 44 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.