Vizag Steel Plant: విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు.. 5 దశాబ్దాల తర్వాత మళ్ళీ అదే నినాదం.. తెర వెనుక అసలు కథ ఇదే!
వైజాగ్ స్టీలు ప్లాంటు ప్రైవేటైజేషన్ ప్రకటన రచ్చకు దారితీసింది. ఉక్కు నగరం కార్మికులు, ఉద్యోగులు, రాజకీయ నేతల నినాదాలు, ప్రకటనలు, ప్రసంగాలతో హోరెత్తుతోంది. అసలీ రచ్చకు కారణమేంటి? నేపథ్యం ఏంటి?
Vizag Steal Plant privatization and agitation: ‘‘ విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు ’’ ఈ నినాదం ఈనాటిది కాదు. వైజాగ్ నగరంలో ఉక్కు కర్మాగారం పెట్టాలన్న డిమాండ్ తలెత్తిన నాటి నుంచి ఉత్తరాంధ్ర నుంచి మొదలై యావత్ ఆంధ్రప్రదేశ్ అంతటా హోరెత్తిన నినాదమిది. దాదాపు అయిదు దశాబ్ధాల తర్వాత మరోసారి ఈ నినాదం సాగర తీరంలో హోరెత్తుతోంది. పార్టీలకతీతంగా సంఘటితంగా విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని కాపాడుకోవాలన్న తాపత్రయం కనిపిస్తోంది. అధికార వైసీపీ మొదలుకొని తెలుగుదేశం, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు) పార్టీలన్నీ ఉద్యమ పర్వానికి శ్రీకారం చుట్టాయి. రెండు, మూడు రోజుల కార్మిక సంఘాల ఉద్యమ తీవ్రత రాజకీయ పార్టీలకు కాస్త గట్టిగానే తగిలింది. దాంతో రాజీనామాల పర్వం కూడా మొదలైంది.
ఇదీ నేపథ్యం..
60వ దశకం తొలినాళ్ళలో విశాఖ ఉక్కు కర్మాగారం కోసం ఉద్యమం మొదలైంది. ప్రాంతీలకు అతీతంగా విశాఖ ఉక్కు కర్మాగారం కోసం ఉద్యమాలు నడిచాయి. ఊళ్ళన్నీ కదిలి ‘‘ విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు ’’ అన్న నినాదంతో హొరెత్తాయి. క్రమంగా తీవ్ర రూపం దాల్చిన విశాఖ స్టీల్ ప్లాంటు ఉద్యమం చివరికి పోలీసు కాల్పుల దాకా వెళ్ళింది. 1966 నవంబర్ 1వ తేదీన వైజాగ్ నగరంలో ఉద్యమ కారులపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు విద్యార్థులతోపాటు మరో ఆరుగురు మత్యువాత పడ్డారు. మొత్తమ్మీద స్టీల్ ప్లాంట్ కొరకు జరిగిన ఆందోళన కార్యక్రమాలలో 32 మంది మరణించినట్లు సమాచారం. ఇందులో తెలంగాణ ప్రాంతానికి చెందిన ఆదిలాబాద్, వరంగల్ పట్టణాల వారు కూడా వున్నారు.
ఆందోళన తీవ్రరూపం దాల్చడంతో దిగి వచ్చిన అప్పటి ఇందిరా గాంధీ ప్రభుత్వం విశాఖలో స్టీల్ ప్లాట్ ఏర్పాటు చేయనున్నట్లు 1970 ఏప్రిల్ నెలలో పార్లమెంటులో ప్రకటించింది. ఆ తర్వాత 1971 జనవరి 20వ తేదీన విశాఖ స్టీల్ ప్లాంట్‌కు అంకురార్పణ జరిగింది. అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ స్వయంగా స్టీల్ ప్లాంటుకు శంకుస్థాపన చేశారు. స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి కురుపాం సంస్థానాధీశులు ఆరు వేల ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారు. శంకుస్థాపన అయితే జరిగింది కానీ.. పలు కారణాల వల్ల స్టీల్ ప్లాంటు నిర్మాణం వేగంగా జరగలేదు. ఒక్క డీపీఆర్ (డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు) రూపకల్పనకే ఏడేళ్ళు పట్టిందంటే స్టీల్ ప్లాంటు వ్యవహారాలు ఎంత నత్తనడకన సాగాయో అర్థం చేసుకోవచ్చు.
డీపీఆర్ రూపకల్పన బాధ్యతలను తీసుకున్న దస్తూర్ అండ్ కంపెనీ 1977లో తమ నివేదికను కేంద్రం ముందుంచింది. ఆనాటికి దేశ పరిపాలనా పగ్గాలు జనతా పార్టీకి దక్కాయి. అప్పటి జనతా ప్రభుత్వం 1977లో విశాఖ ఉక్కు కర్మాగారం నిర్మాణానికి వేయి కోట్ల రూపాయలను కేటాయించడంతో నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి. అయితే ఫ్యాక్టరీ నిర్మాణానికి స్వదేశీ పరిఙ్ఞానం సరిపోదని గ్రహించిన కేంద్రం.. నిర్మాణ పనుల్లో రష్యా భాగస్వామ్యం తీసుకుంది.
ప్లాంటు నిర్మాణం కోసం సోవియట్ రష్యా సహకారం తీసుకుంటూ కేంద్ర ప్రభుత్వం 1981లో ఒప్పందం చేసుకుంది. 1982 జనవరిలో బ్లాస్ట్ ఫర్నేస్ నిర్మాణానికి ఫౌండేషన్ పడింది. అయితే కాంగ్రెస్ పరిపాలనతో బడ్జెట్ కేటాయింపులు సరిపోకపోవడంతో ఫ్యాక్టరీ నిర్మాణం నెమ్మదిగా సాగింది. 1990లో వైజాగ్ ప్లాంటులో ఉక్కు ఉత్పత్తి ప్రారంభమైంది. ఆ తర్వాత మరో రెండేళ్లకు అంటే 1992 చివరి నాటికి పూర్తిస్థాయిలో స్టీల్ ప్లాంటు పని చేయడం మొదలైంది. వైజాగ్ స్టీల్ ప్లాంటు ప్రస్తుతం 26 వేల ఎకరాల భూమిలో విస్తరించి వున్నది. ఫ్యాక్టరీ ఉత్పత్తి సామర్థ్యం ఏడాదికి ఏడున్నర మిలియన్ టన్నులు. పదహారు వేల మంది పర్మనెంటు ఉద్యోగులు కాగా.. సుమారు 18 వేల మంది కాంట్రాక్టు కార్మికులు స్టీల్ ప్లాంటులో పని చేస్తున్నారు. పరోక్షంగా మరో లక్షన్నర మంది ఉపాధి పొందుతున్నారు.
కానీ.. గత కొంత కాలంగా విశాఖ ఉక్కు కర్మాగారానికి సొంతంగా ఐరన్ ఓర్ (ఇనుప ఖనిజం) గనులు లేకపోవటంతో తరచుగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇప్పుడు మరోసారి ‘‘ విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు ’’ అన్న నినాదం హోరెత్తడానికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బడ్జెట్‌తో బీజం పడింది. ఏళ్ళ తరబడి నష్టాల బాటన కొనసాగుతున్న విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని త్వరలో ప్రైవేటుపరం చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దాంతో ఆంధ్ర ప్రజలు, నాయకులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు.
ఫ్యాక్టరీ నిర్మాణానికి శంకుస్థాపన జరిగి సరిగ్గా 50 ఏళ్లు పూర్తి కాగా ఇప్పుడు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేగమవుతున్నాయి. ప్రైవేటీకరణ యత్నాలపై విమర్శలు, వ్యతిరేకత వ్యక్తమవుతున్నాయి. రాజకీయాలు ఎన్ని ఉన్నా.. ‘‘పోరాడనిదే ఆంధ్రులకు ఏ హక్కులూ రావు’’ అన్న నాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి వ్యాఖ్యలను తాజాగా పలువురు నేతలు, రాజకీయ పరిశీలకులు గుర్తు చేస్తున్నారు.
నిజానికి దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రారంభించిన కాంగ్రెస్ ప్రభుత్వాలు దేశంలో పలు ప్రభుత్వ రంగ సంస్థలల్లో వాటాలను ప్రైవేటు వారికి విక్రయించాయి. కేంద్ర ఖజానాకు ఈ డిసిన్మెస్టుమెంటు వల్ల లక్షల కోట్ల రూపాయలు వచ్చి పడ్డాయి. ప్రైవేటీకరణ వల్ల దేశంలో విదేశీ పెట్టుబడులు వెల్లువెత్తాయి. 1991లో ఆర్థిక సంస్కరణలను ప్రారంభించి.. ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రైవేటు భాగస్వామ్యం కల్పిస్తూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ 2004-2014 మధ్య పెట్టుబడుల ఉపసంహరణను వేగంగా కొనసాగించింది. ఈ సమయంలోనే విశాఖ ఉక్కు కర్మాగారంలోని ప్రభుత్వ వాటాను ప్రైవేటుపరం చేయాలన్న ప్రతిపాదన తెరమీదికి వచ్చింది.
తాజాగా దేశంలో పలు ప్రతిష్టాత్మక పబ్లిక్ రంగ సంస్థలన్నీ నష్టాల బాట పట్టడంతో మరోసారి పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను మోదీ ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇందులో భాగంగా విశాఖ స్టీల్ ప్లాంటును ప్రైవేటు పరం చేయబోతున్నట్లు ఇటీవల ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ ప్రకటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో అగ్గి రాజేసింది. స్టీలు ప్లాంటు ఉద్యోగులు, కార్మికులు ఆందోళనకు శ్రీకారం చుట్టారు. సహజంగానే విపక్షాలు ఈ ఆందోళనలో భాగస్వామ్యమయ్యాయి. అధికార వైసీపీకి ఇబ్బంది కలిగినట్లు అనిపించినా.. ఆ పార్టీ ఎంపీలు రంగంలోకి దిగి కేంద్రంపై ధ్వజమెత్తారు. ప్లాంటు ప్రైవేటీకరణపై కేంద్రాన్ని నిలదీశారు. నష్టాల పేరు చెప్పి ప్లాంటును ప్రైవేటు పరం చేస్తే సహించేది లేదని కుండ బద్దలు కొట్టారు.
అటు విపక్ష తెలుగుదేశం పార్టీతో పాటు వామపక్షాలు ఉద్యోగులు, కార్మికుల ఆందోళనను రాష్ట్రం నలుమూలలా విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి. కార్మికుల ఒత్తిడో లేక రాజకీయ వ్యూహమో కానీ.. ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. తెలుగుదేశం పార్టీ తరపున అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తూ.. ప్రస్తుతం ఆ పార్టీకి కాస్త దూరం మెయింటేన్ చేస్తున్న ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఇది మిగిలిన ఎమ్మెల్యేలకు, ఎంపీలకు కాస్త ఇబ్బందిగా మారింది. ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామా చేయడం ద్వారా కేంద్రంపై ఒత్తిడి పెంచాలన్న డిమాండ్ క్రమంగా బలపడేందుకు గంటా రాజీనామా దారి తీస్తోంది.
అయితే, దేశవ్యాప్తంగా కొనసాగుతున్న పెట్టుబడుల ఉపసంహరణ ప్రహసనాన్ని విశాఖ ప్లాంటు విషయంలో కేంద్రం పక్కన పెడుతుందా అన్నదిపుడు పెద్ద ప్రశ్న. ఏపీలో పాగా వేయాలని చూస్తున్న బీజేపీ.. ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ విషయంలో ముందుకు వెళితే స్థానిక కమలనాథులకు ఏపీ ప్రజలను చుక్కలు చూపించడం ఖాయం. అయితే, పెట్టుబడుల ఉపసంహరణ జరిగిన వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగులకు, కార్మికులకు ఎలాంటి నష్టం వాటిల్ల లేదన్న విషయాన్ని వైజాగ్ ప్లాంటు కార్మిక, ఉద్యోగ సంఘాలను వివరించేందుకు బీజేపీ నేతలు రెడీ అవుతున్నట్లు సమాచారం. మొత్తమ్మీద స్టీలు ప్లాంటు ప్రైవేటీకరణ ఏపీలో ఎలాంటి రాజకీయ పరిణామాలకు తెరలేపుతుందో అన్నది ఉత్కంఠగా మారుతోంది.
Also Read: కరోనా వైరస్ రూపాంతరం..! వ్యాక్సిన్‌ల మార్పు అనివార్యమా?
Also Read: ‘ఆ’ దేశాలకు వెళ్ళాలని అనుకుంటున్నారా? ఇవి పాటించకపోతే మీరు ఇబ్బందుల్లో పడడం ఖాయం