ఆయన కమలదళంలో కీలక నేత. వాజపేయ్ కేబినెట్‌లో మినిస్టర్. ఆ తర్వాత కొన్నాళ్లు రాజ్యాంగ పదవిలో ఉన్నారు. ఇటీవల మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఇక ఆయన యాక్టివ్ అవుతారు. తెలంగాణలో మళ్లీ కమలం వికాసం ఖాయమని అనుకున్నారు. తీరా చూస్తే ఆయన సైలెంట్ అయిపోయారు. కనీసం ఎక్కడా కనిపించడం లేదు. ఈ ఇంట్రడక్షన్ చెన్నమనేని విద్యాసాగర్ రావు అలియాస్ సాగర్ జీ గురించే. తెలంగాణ బీజేపీలో మళ్ళీ యాక్టివ్ అవుతారనుకున్న విద్యాసాగర్ రావు.. ఇంకా సైలెంటైపోయారు. ఎందుకన్నది ఇప్పుడు పార్టీ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.
చెన్నమనేని విద్యాసాగర్ రావు. బీజేపీ సీనియర్ నేత. ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్రమంత్రిగా, గవర్నర్‌గా పనిచేశారు. ఒకానొక దశలో ఓ ఛానల్‌లో రాజకీయ చర్చకు యాంకర్‌గా కూడా వ్యవహరించారు. కరీంనగర్ జిల్లాతో పాటు మంచి ఫాలోయింగ్ లీడర్. గవర్నర్ పదవీకాలం ముగిసిన తర్వాత ఆయనకు పొడిగింపు రాకపోవడంతో ఆయన తిరిగి హైదరాబాద్ వచ్చేశారు. బీజేపీ కార్యాలయంలో మళ్ళీ పార్టీ సభ్యత్వం స్వీకరించారు. ఇక యాక్టివ్ అవుతానని ప్రకటించారు కూడా. కానీ కాలేదు. కారణమేంటి?
ఇంకోవైపు 2023 అసెంబ్లీ ఎన్నికల నాటికి బీజేపీని బలోపేతం చేసి… అధికారంలోకి తీసుకురావడానికి ఆ పార్టీ వ్యూహాలు రూపొందిస్తోంది. ఇటు మహారాష్ట్ర గవర్నర్‌గా పదవీకాలం ముగిసిన తర్వాత విద్యాసాగర్‌రావు బీజేపీ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. దాంతో ఆయన కమలంలో మళ్లీ కీలక పాత్ర పోషిస్తారని అనుకున్నారు. కానీ విద్యాసాగర్ రావు మాత్రం హైదరాబాద్‌కు పరిమితమయ్యారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు.
మొన్న జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో కూడా విద్యాసాగర్‌రావు ఎక్కడా కనిపించలేదు. సొంత జిల్లా కరీంనగర్‌లో ఎక్కడా ప్రచారం నిర్వహించలేదు. కొత్తగా కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం గురించి అవగాహన సదస్సులను బీజేపీ నిర్వహిస్తోంది. ఈ సమావేశాలకు కూడా ఆయన హాజరు కావడం లేదు. దీంతో విద్యాసాగర్ రావు ఏం చేస్తున్నారు? ఆయన ఎందుకు కమలం పార్టీ సమావేశాల్లో కనిపించడం లేదు? అనే చర్చ మొదలైంది.
తెలంగాణలో సీనియర్ల సేవలు అవసరమని బీజేపీ నాయకత్వం గుర్తించింది. పార్టీ బలోపేతం కోసం విద్యాసాగర్‌రావు సేవలు అవసరమని భావించింది. అయితే సాగర్ జీ మాత్రం బయటకు రావడం లేదు. ఆయన జాతీయ రాజకీయాలకు మాత్రమే పరిమితమవుతారా? లేక రాష్ట్ర రాజకీయాల వైపు చూస్తారా? అనే విషయం అర్ధం కావడం లేదని కేడర్ అంటోంది. మొత్తానికి సాగర్‌జీ పయనం ఎటు అనే చర్చ కమలంలో జోరుగా నడుస్తోంది.