ఏడాదిగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు వైద్య సిబ్బంది అహార్నిశలు శ్రమిస్తున్నారు. కరోనా వ్యాపిస్తుందని తెలిసినా.. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కరోనా బాధితులకు చికిత్సలందిస్తున్నారు. కుటుంబసభ్యులకు సైతం దూరంగా ఉంటూ వైద్య సేవల్లో నిమగ్నమయ్యారు. అయితే, వీరి ఒత్తిడిని దూరం చేయడం కోసం యూఎస్‌లోని ఓహాయో రాష్ట్రంలో ఓ ఆస్పత్రి వినూత్న ఆలోచన చేసింది. ఫలితంగా ఓ శునకానికి ఉద్యోగం లభించింది.
స్టేట్ యూనివర్సిటీకి చెందిన వెక్స్‌నర్ మెడికల్ సెంటర్‌లో షిలో అనే ఒక శునకం వాలంటీర్‌గా విధులు నిర్వర్తిస్తోంది. ఆస్పత్రి మొత్తం తిరుగుతూ కనిపించిన వారి వద్దకెళ్లి పలకరించడమే దాని పని. మనిషికి ఉండే ఒత్తిళ్లను దూరం చేయడంలో పెంపుడు జంతువులు ముఖ్య పాత్ర వహిస్తాయని, వాటితో కాసేపు సమయం గడిపితే చాలు.. ఒత్తిడి దూరమవుతుందని మానసిక నిపుణులు చెబుతుంటారు. అందుకే ఆస్పత్రి యాజమాన్యం ‘స్టార్ ప్రోగ్రామ్’ కింద శునకానికి ఇటీవల ఉద్యోగమిచ్చి వైద్య సిబ్బంది ఒత్తిడిని తొలగించే ప్రయత్నం చేస్తోంది. ఈ శునకానికి మెడలో ఐడీ కార్డు, ప్రత్యేక గది, భోజన వసతులను సమకూర్చారు. అమాయకపు ముఖం పెట్టి పలకరింపుతో వైద్య సిబ్బంది ప్రేమాభిమానాలు పొందుతుంది. దీంతో కాసేపు కాలక్షేపం చేస్తూ వైద్య సిబ్బంది సేదతీరుతున్నారని ఆస్పత్రి యాజమాన్యం చెబుతుంది.
ఆ ఆస్పత్రిలో పనిచేసే డాక్టర్ షరీ డునావే.. కొత్త ఉద్యోగంలో చేరిన షిలో గురించి వివరిస్తూ పోస్టు చేశారు. దీంతో ఆ పోస్టు వైరల్‌గా మారింది. లక్షకుపైగా నెటిజన్లు ఆ ట్వీట్‌ను లైక్ చేశారు. వేలమంది షేర్ చేస్తున్నారు. ఫిలిప్పీన్స్‌లోని ఇలిగన్ మెడికల్ సెంటర్‌లోనూ ఓ శునకం ఆస్పత్రి సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వర్తిస్తోందట. ఆ దేశానికి చెందిన ఓ యువతి ‘మా దేశంలోనూ ఓ శునకం ఆస్పత్రిలో ఉద్యోగం చేస్తోంద’ని ట్వీట్ చేసింది.
My hospital hired an employee whose only job is to go around saying hi to other employees while they work pic.twitter.com/WWXNeEiWne
— Shari Dunaway, MD (@ShariDunawayMD) November 20, 2020