అమెరికా కాంగ్రెస్ (ప్రతినిధుల సభ, సెనేట్) మంగళవారం కీలకమైన రక్షణ బిల్లును ఆమోదించింది. 740 బిలియన్ డాలర్ల వ్యయానికి ఉద్దేశించిన ఈ పాలసీ బిల్లులో..ముఖ్యంగా భారత వాస్తవాధీన రేఖ పొడవునా చైనా ఆక్రమణను ఖండించిన తీర్మానాన్ని కూడా చేర్చారు. నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్ట్ పేరిట ఈ డిఫెన్స్ పాలసీ బిలును రూపొందించారు. లడాఖ్ నియంత్రణ రేఖ వద్ద తన సైనిక ఆక్రమణకు చైనా స్వస్తి చెప్పాలంటూ ఇండియన్ అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి ఈ తీర్మానంలో కోరారు. ఈ ఏడాది మే నెల నుంచి తూర్పు లడాఖ్ లో వాస్తవాధీన రేఖ వద్ద భారత-చైనా దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. వీటి పరిష్కారానికి ఉభయ దేశాల మధ్య పలు దఫాలుగా సాగిన చర్చలు ఇప్పటివరకు ఎలాంటి ఫలితాన్నీ ఇవ్వలేదు.
అమెరికా కాంగ్రెస్ లో ఈ బిల్లు ఆమోదం పొందుతుండగా రాజా కృష్ణమూర్తి చిన్న సవరణ చేస్తూ తన తీర్మానాన్ని ఇందులో చేర్చారు. ఇండియా వంటి మిత్ర దేశాలతో అమెరికా ప్రభుత్వ మైత్రిని ఇది సూచిస్తోందని ఆయన అన్నారు. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఈ బిల్లుపై సంతకం చేయగానే ఇది చట్టమవుతుంది. అయితే సోషల్ మీడియా సంస్థలకు లీగల్ రక్షణ రద్దు చేయాలన్న అంశం ఇందులో లేనందున దీన్ని వీటో చేస్తానని ట్రంప్ హెచ్చరించారు. కానీ మొత్తానికి సభ బిల్లుకు ఆమోదముద్ర వేసింది. చైనా ఆక్రమణ అంశాన్ని ఈ బిల్లులో చేర్చడంపట్ల రాజా కృష్ణమూర్తి హర్షం వ్యక్తం చేశారు. దీన్ని చట్టం చేయడంద్వారా భారత్ పట్ల చైనా దురాక్రమణను తాము సహించబోమని అమెరికా..చైనాకు గట్టి వార్నింగ్ ఇఛ్చినట్టయిందని ఆయన అన్నారు. ఇండియా వంటి భాగస్వామ్యదేశాలతో యుఎస్ ఎప్పుడూ సన్నిహితంగా ఉంటుందనడానికి ఇదే సంకేతమన్నారు. భారత-చైనా దేశాల మధ్య సీమాంతర హింసావాదానికి పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా స్వస్తి చెప్పాలని కూడా ఈ బిల్లులో పేర్కొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
దౌత్య మార్గాల ద్వారా చైనా..ఇండియాతో తన వివాదాలను పరిష్కరించుకోవాలని, లడాఖ్ లో సేనల ఉపసంహరణపై దృష్టి పెట్టాలని కూడా అమెరికా కోరింది.