కొవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధి ప్రపంచ దేశాల సెంటిస్టులు తలామునకలై ఉన్నారు. వ్యాక్సిన తయారీలో ముందు వరుసలో ఉన్న దేశాల్లో భారత్ కూడా ఉంది. వ్యాక్సిన్స్ ఉత్పత్తి కోసం అమెరికా సంస్థలు భారత్ వైపు చూస్తున్నాయి. తాజాగా కరోనా వైరస్ నియంత్రణ కోసం అమెరికాకు చెందిన బేలర్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్.. హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్ ఈ లిమిటెడ్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నది. సురక్షితమై, ప్రభావంతమైన, అతి తక్కువ ధరలో టీకా ఉండే విధంగా ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరినట్లు సమాచారం. బేలర్ అభివృద్ధి చేస్తున్న రికాంబినెంట్ ప్రోటిన్ కోవిడ్19 వ్యాక్సిన్ లైసెన్సు కోసం బీఈ ఒప్పందం చేసుకున్నట్లు బీసీఎం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈస్ట్ ఆధారిత టెక్నాలజీతో వ్యాక్సిన్ తయారు చేస్తున్నట్లు టెక్సాస్‌కు చెందిన బీసీఎం వెల్లడించింది.
వ్యాక్సిన్ అభివృద్ధి, దాని ఉత్పత్తి కోసం బీఈతో డీల్ కుదుర్చుకున్నట్లు ఆ సంస్థ తెలిపింది. బేలర్ మెడిసిన్ స్కూల్‌లో సార్స్, మెర్స్ వ్యాధులకు టీకాలను తయారు చేస్తున్నట్లు ప్రొఫెసర్ పీటర్ హోట్జ్ తెలిపారు. తాము తయారు చేస్తున్న వ్యాక్సిన్ ప్రస్తుతం భారత్‌లో ట్రయల్స్ దశలో ఉన్నట్లు వెల్లడించారు. వచ్చే ఏడాది ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో బీఈ కూడా ప్రకటన విడుదల చేసింది. బేలర్‌తో కుదిరిన ఒప్పందం వల్ల అతి తక్కువ ధరలో టీకాను తయారు చేయనున్నట్లు బీఈ చెప్పింది. భారత్‌తో పాటు స్వల్ప ఆదాయ దేశాలకు ఈ టీకా ఉపయోగపడుతుందని బయోలాజికల్ ఈ సంస్థ వెల్లడించింది.