AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వింత వ్యాధి కలకలం.. ఏలూరులో ఆగని కలవరం.. పెరుగుతున్న బాధితుల సంఖ్య.. లక్షణాలను అనుసరించి వైద్యుల చికిత్స..

పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో వింత వ్యాధి కారణంగా ఆసుపత్రికి వస్తున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. ప్రస్తుతం ఈ వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య 370 పైచిలుకు చేరింది.

వింత వ్యాధి కలకలం.. ఏలూరులో ఆగని కలవరం.. పెరుగుతున్న బాధితుల సంఖ్య.. లక్షణాలను అనుసరించి వైద్యుల చికిత్స..
Ravi Kiran
|

Updated on: Dec 07, 2020 | 1:48 PM

Share

Unknown Diease In Eluru: పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో వింత వ్యాధి కారణంగా ఆసుపత్రికి వస్తున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. ప్రస్తుతం ఈ వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య 370 పైచిలుకు చేరింది. వీరిలో 187 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. మరో 14 మంది బాధితులను గుంటూరు, విజయవాడ ఆసుపత్రికి తరలించారు. ఇక 168 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయినట్టు వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. మూర్ఛపోయి ఆసుపత్రికి వచ్చి చికిత్స పొందుతూ శ్రీధర్‌ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. రెండు రోజులుగా ఈ వింత వ్యాధితో వందల మంది ఆసుపత్రుల పాలవుతున్నా దీనికి కారణాలేమిటో తెలియక వైద్యలు సతమతమవుతున్నారు. బాధితుల్లో అత్యధికులు 20 నుంచి 30 సంవత్సరాల్లోపు వయసువారే. రక్తపోటు, మధుమేహంలాంటి వ్యాధులేవీ లేకపోయినా.. ఉన్నట్లుండి అస్వస్థతకు గురికావడం చర్చనీయాంశమైంది. ఆసుపత్రిపాలైన వారిలో 12 సంవత్సరాల్లోపు చిన్నారులు కూడా దాదాపు 40 మంది వరకూ ఉన్నారు.

నగరంలోని తాపీమేస్త్రీ కాలనీ, పడమరవీధి, కొత్తపేట, అశోక్‌నగర్‌, తంగెళ్లమూడి, శనివారపుపేట, ఆదివారపుపేట, అరుంధతీపేట ప్రాంతాలవారు అస్వస్థతకు గురై ఆసుపత్రుల్లో చేరారు. ఆదివారం కొత్తగా ఇందిరమ్మ కాలనీ, మరడాని రంగారావు కాలనీ, వైఎస్సార్‌ కాలనీల నుంచి ఆస్పత్రిలో చేరారు. మరోవైపు దెందులూరు పరిధిలోని కేదవరం ప్రాంతం నుంచి కొందరు వింత వ్యాధి లక్షణాలతో స్థానికంగానే చికిత్స పొంది కోలుకున్నారు. బాధితుల లక్షణాలు, వారి ఆరోగ్య చరిత్రను అనుసరించి చికిత్స అందిస్తున్నారు. వ్యాధి మూలాలు తెలిస్తే అందుకు తగ్గ చికిత్స అందించేందుకు వీలుంటుందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం లక్షణాలు అనుసరించి అందిస్తున్న చికిత్స వల్ల రోగులు గంటల వ్యవధిలోనే కోలుకుంటున్నారన్నారు. వయసులో పెద్దవారికి మాత్రం సీటీ స్కాన్‌ తీస్తున్నారు. జ్వరం, వాంతులు వంటి లక్షణాలు లేనందున సెలైన్‌, మందులతో చికిత్స అందిస్తున్నారు. కరోనా నేపథ్యంలో బాధితులందరికీ కోవిడ్ నిర్ధారణ పరీక్షలు కూడా చేస్తున్నారు.

బాధితుల జీవనోపాధి, వారి నివాస ప్రాంతాలు, ఆహార అలవాట్లు, కరోనా నేపథ్యంలో మందులు ఏమైనా వాడుతున్నారా? నీటి సరఫరా తీరు గురించి మంగళగిరి ఎయిమ్స్‌ నుంచి డాక్టర్‌ కక్కర్‌ నేతృత్వంలో వైద్యుల బృందం అధికారులతో ఎక్కువ సమయం చర్చించారు. ఏ చికిత్స అందిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. వైరస్‌ నిర్ధారణ కోసం బాధితుల నుంచి ఎయిమ్స్‌ వైద్య బృందం నమూనాలు సేకరించింది. కొందరి నుంచి రక్త నమూనాలు కూడా సేకరిస్తున్నట్లు తెలిపారు. కాగా, ఈ అంశంపై కేంద్రం నుంచి ఎలాంటి సహాయం కావాలన్నా అందించేందుకు సిద్ధమని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు.