జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రదాడి.. అమరులైన ఇద్దరు జవాన్లు.. కారులో పరారైన టెర్రరిస్టులు
జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ జిల్లాలోని నగ్రోటా ప్రాంతంలో గురువారం జరిగిన ఉగ్రదాడిలో ఇద్దరు భారత జవాన్లు అమరులయ్యారు. ఇండియన్ ఆర్మీకి చెందిన క్విక్ రియాక్షన్ టీమ్ పై ముగ్గురు టెర్రరిస్టులు విచక్షణా రహితంగా..
జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ జిల్లాలోని నగ్రోటా ప్రాంతంలో గురువారం జరిగిన ఉగ్రదాడిలో ఇద్దరు భారత జవాన్లు అమరులయ్యారు. ఇండియన్ ఆర్మీకి చెందిన క్విక్ రియాక్షన్ టీమ్ పై ముగ్గురు టెర్రరిస్టులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. జనసందోహం ఎక్కువగా ఉండడంతో భారత సైన్యం వారిపై ఎదురుకాల్పులు జరపలేకపోయింది. ఇదే అవకాశంగా ఉగ్రవాదులు తెగబడ్డారు. వారి కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఇద్దరు సైనికులు ఆసుపత్రిలో మరణించారు. కాల్పుల అనంతరం టెర్రరిస్టులు కారులో పారిపోయారని, వారిలో ఇద్దరు పాకిస్తానీయులు కాగా ఒకరు స్థానిక టెర్రరిస్ట్ అని ఆర్మీ వర్గాలు తెలిపాయి.
2008 లో నవంబరు 26 న ముంబైలో జరిగిన పేలుళ్లలో మృతి చెందినవారికి నివాళులు అర్పించేందుకు దేశంలోని పలు ప్రాంతాల నుంచి పలువురు ఇక్కడికి చేరుకున్నారు. ఇదే అదనని ముష్కరులు విజృంభించారు. ఈ దాడికి పాల్పడింది జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన వారేనని భారత సైన్యం భావిస్తోంది. కాగా- నిన్న జరిగిన ఎన్ కౌంటర్ లో నలుగురు టెర్రరిస్టులు మరణించడంతో దానికి ప్రతీకారం తీర్చుకునేందుకు గురువారం జైషే టెర్రరిస్టులు ఈ ఎటాక్ కి దిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటన జరిగిన వెంటనే శ్రీనగర్ పోలీసులు, సైనికులు నగ్రోటా ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అక్కడ దాక్కుని ఉండవచ్ఛునని భావించిన వీరు తమ గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.