AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇద్దరు సీఎంలకు కొత్త తలనొప్పి… ఎదుర్కొనేదెలా?

ఇద్దరు ముఖ్యమంత్రులకు కొత్త సవాలు ఎదురుకాబోతోంది. లాక్ డౌన్ ఆంక్షల సడలింపు.. కరోనా వైరస్ వ్యాప్తి పెరగడం.. వెరసి ఇద్దరు ముఖ్యమంత్రులకిపుడు కొత్త తలనొప్పి తగులుకుంది.

ఇద్దరు సీఎంలకు కొత్త తలనొప్పి... ఎదుర్కొనేదెలా?
Rajesh Sharma
|

Updated on: May 15, 2020 | 3:43 PM

Share

Two chief ministers worried over migrating labor: ఇద్దరు ముఖ్యమంత్రులకు కొత్త సవాలు ఎదురుకాబోతోంది. లాక్ డౌన్ ఆంక్షల సడలింపు.. కరోనా వైరస్ వ్యాప్తి పెరగడం.. వెరసి ఇద్దరు ముఖ్యమంత్రులకిపుడు కొత్త తలనొప్పి తగులుకుంది. కేంద్రం తాజాగా జారీ చేసిన ఆదేశాలు ఇద్దరు ముఖ్యమంత్రులకు కొత్త ఛాలెంజ్‌ని ముందుకు తెచ్చాయి. కేంద్రం ఆదేశాలను అమలు చేయకపోతే ఒక ప్రాబ్లెం.. చేస్తే కరోనాను నియంత్రించడం పెద్ద సవాలు… ఇలా ఇద్దరు ముఖ్యమంత్రులిపుడు తీవ్ర స్థాయిలో మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది.

నాలుగో విడత లాక్ డౌన్ పరిస్థితిలో చాలా మటుకు ఆంక్షల సడలింపు వుండే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన సంకేతాలు ఓ వైపు అందుతుంటే.. మరోవైపు పలు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దేశంలో త్వరలోనే లక్ష మార్కును దాటే పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ ఆంక్షల సడలింపు.. కరోనా కేసులు పెరుగుదల… ఇంకోవైపు వలస కార్మికుల తరలింపు.. ఇలా పలు రాష్ట్రాలు ఏం చేయాలో దిక్కు తోచక కేంద్రం వైపు చూస్తున్నాయి.

దేశంలో ఏ రాష్ట్రంలో చూసినా.. రెండు రాష్ట్రాల వలస కార్మికులు తప్పకుండా కనిపిస్తారు. పలు రాష్ట్రాల నుంచి వలసకు వెళ్ళి ఉపాధి వెతుక్కునే వారున్నప్పటికీ.. బీహార్, ఒడిశా రాష్ట్రాల నుంచి మాత్రం వలస కార్మికులు చాలా ఎక్కువ సంఖ్యలో వుంటారు. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు మహారాష్ట్ర కర్నాటక, ఢిల్లీ, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలలో బీహార్, ఒడిశా వర్కర్లు పెద్ద సంఖ్యలో వుంటారు. లాక్ డౌన్ కారణంగా ఉపాధి దొరక్కపోవడంతో వారంతా లక్షల సంఖ్యలో తిరిగి తమ స్వస్థలాలకు వెళుతున్నారు. దానికి తోడు కేంద్ర హోం శాఖ కూడా వలస కార్మికుల తరలింపునకు పెద్ద ఎత్తున ఆదేశాలు జారీ చేస్తోంది. రహదారులపై దిక్కుతోచక పయనిస్తున్న కార్మికులను ఆదుకోవాలని హోం శాఖ రాష్ట్రాలను కోరింది.

ఈ నేపథ్యంలో మహారాష్ట్ర, కర్నాటకల నుంచి వస్తున్న కార్మికులతో తమ రాష్ట్రానికి కరోనా వైరస్ పెద్ద ఎత్తున వచ్చిపడుతుందని బీహార్, ఒడిశా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆందోళన చెందుతున్నారు. వచ్చే వారందరికీ క్వారెంటైన్‌ సెంటర్లకు తరలించేందుకు యత్నిస్తున్నా.. వారు దానికి సహకరించకపోవడంతో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నితీశ్ కుమార్, నవీన్ పట్నాయక్ తలలు పట్టుకుంటున్న పరిస్థితి. అంత దూరం నుంచి వచ్చిన తమను.. తమ కుటుంబీకులతో వుండనీయకపోవడమేంటని వలస కార్మికులు అధికారులతో గొడవకు దిగుతున్నారు.

ఇలా వలస వచ్చిన వారిలో 35 వేల మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఒక్క బీహార్ రాష్ట్రంలోనే 900కు పైగా కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఒడిశాలోను మాస్ టెస్టింగ్ ఏర్పాట్లు చేశారు. ఇంకా ఎంత మంది వలస కార్మికుల్లో పాజిటివ్ వస్తుందోనని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆందోళన చెందుతున్నాయి. మరోవైపు ముంబయి నుంచి వచ్చిన వారిలో 45 మందికి మే 15వ తేదీన కరోనా పాజటివ్ రావడంతో కర్నాటకలోను ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వస్తున్న వలస కార్మికులతో పెద్ద ఎత్తున కరోనా వైరస్ వచ్చిపడుతున్న సంకేతాలు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ మరింత పకడ్బందీగా కొనసాగించడమొక్కటే మార్గమని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం తీసుకుంటున్న సడలింపు నిర్ణయాలు షాకిస్తున్నాయి.