Twitter suspends Donald Trump: అమెరికా అధ్యక్షపదవిని వీడుతోన్న తరుణంలో ట్రంప్‌నకు ఎదురు గాలి వీస్తోంది. కొన్నిరోజులపాటు అధ్యక్ష పీఠాన్ని వీడేది లేదంటూ భీష్మించి కూర్చున్న ట్రంప్ ఎట్టకేలకు అధికార మార్పిడికి ఒప్పుకున్నారు. అయితే అమెరికాలోని క్యాపిటల్ భవనంలో హింసాత్మక ఘటనలపట్ల ట్రంప్ వ్యవహరించిన తీరుకు సోషల్ మీడియా దిగ్గజాలు ట్విట్టర్, ఫేస్‌బుక్ తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడి స్థానంలో ఉన్న వ్యక్తి అకౌంట్‌పై నిషేధాన్ని విధించి సంచలన నిర్ణయం తీసుకున్నాయి.
ఇదిలా ఉంటే మొదట్లో 24 గంటల నిషేధాన్ని విధించిన ఫేస్‌బుక్ తర్వాత అధికార మార్పిడి పూర్తయ్యే వరకు ఆ నిషేధాన్ని పొడిగించింది. ఇక తాజాగా ట్విట్టర్ మరో సంచనల నిర్ణయం తీసుకుంది. తాజాగా ట్రంప్ ట్విట్టర్ ఖాతాను ఆ సంస్థ పూర్తిగా నిషేధించింది. ఈ మధ్య కాలంలో ట్రంప్ ట్వీట్లను పరిశీలించామని, ఆయన వ్యాఖ్యలు ఉద్రిక్తతలకు ప్రేరేపించేలా ఉన్నాయనే కారణంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్విట్టర్ యాజమాన్యం తెలిపింది. దీనిబట్టి చూస్తే ట్రంప్ ఇకపై ట్విట్టర్‌లో కనిపించలేరన్నమాట. అమెరికాలో అధికార మార్పిడి జరిగేలోపు ఇంకెన్నీ పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి.