తిరుమ‌ల‌లో ప‌విత్ర ఉద్యాన‌వ‌నాలకు టీటీడీ శ్రీకారం.. సర్వదర్శనాలపై క్లారిటీ ఇచ్చిన ఛైర్మన్ సుబ్బారెడ్డి

దర్శనాల సంఖ్య పెంపుపై ఇంకా పునరాలోచించలేదని టీటీడీ చైర్మన్ తెలిపారు. వ్యాక్సినేషన్ ప్రారంభమైన తర్వాతే దర్శనాల సంఖ్య పెంపు, ఆర్జిత సేవల పునరుద్ధరణపై ఆలోచిస్తామన్నారు.

తిరుమ‌ల‌లో ప‌విత్ర ఉద్యాన‌వ‌నాలకు టీటీడీ శ్రీకారం.. సర్వదర్శనాలపై క్లారిటీ ఇచ్చిన ఛైర్మన్ సుబ్బారెడ్డి
Follow us
Balaraju Goud

|

Updated on: Jan 07, 2021 | 8:51 PM

తిరుమలలో దర్శనాల సంఖ్య పెంపుపై టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి స్పందించారు. ఈరోజు సాయంత్రం తిరుమలలో ఆయన పవిత్ర ఉద్యాన వనాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దర్శనాల సంఖ్య పెంపుపై ఇంకా పునరాలోచించలేదని తెలిపారు. వ్యాక్సినేషన్ ప్రారంభమైన తర్వాతే దర్శనాల సంఖ్య పెంపు, ఆర్జిత సేవల పునరుద్ధరణపై ఆలోచిస్తామన్నారు. అప్పటి వరకు భక్తులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ దర్శనాలకు రావాల్సి ఉంటుందని భక్తులకు సూచించారు. అలాగే, అభిషేక సేవలో భౌతిక దూరం పాటిస్తూ శ్రీవారిని దర్శనం చేసుకునే అవకాశముండటంతో భక్తులను అనుమతించాలని యోచిస్తున్నామన్నారు. వ్యాక్సినేషన్ ప్రారంభించాక కోవిడ్ రిస్క్ తగ్గితే సర్వదర్శనాల పునరుద్ధరణపై పునరాలోచిస్తామని టీటీడీ ఛైర్మన్ స్పష్టం చేశారు.

అంతకు ముందు శ్రీ‌వారి సేవ‌లకు వినియోగించే ‌పుష్పాలు, ప‌త్రాల‌కు సంబంధించిన మొక్కలతో తిరుమ‌ల‌లో ప‌విత్ర ఉద్యాన‌వ‌నాలు ఏర్పాటు చేశారు. తిరుమ‌ల‌లోని శిలాతోరణం, గోగర్భం డ్యామ్‌ల‌ వద్ద పవిత్ర ఉద్యానవనాల‌లో ఛైర్మన్‌, ఈవో డాక్టర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్ రెడ్డి, అద‌న‌పు ఈవో ఏ.వి.ధ‌ర్మారెడ్డితో క‌లిసి గురువారం సాయంత్రం ప‌విత్ర మొక్కలు నాటారు. పురాణాల్లో పేర్కొన్న విధంగా శ్రీ‌వారి పుష్ప కైంక‌ర్యానికి వినియోగించే ‌మొక్కలతో శిలాతోరణం వద్ద 10 ఎకరాల్లో శ్రీ వేంకటేశ్వర పవిత్ర ఉద్యానవనం ఏర్పాటు చేస్తున్నామ‌ని టీటీడీ ఛైర్మెన్ వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. ఇందులో ఏడు ఆకులు క‌లిగిన అర‌టితోపాటు, తుల‌సి, ఉసిరి, మోదుగ‌, జువ్వి‌, జ‌మ్మి, ద‌ర్భ, సంపంగి, మామిడి, పారిజాతం, క‌దంబం, రావి, శ్రీ‌గంధం, అడ‌వి మ‌ల్లి, మొగ‌లి, పున్నాగ‌, అశోక‌, పొగ‌డ‌, ఎ‌ర్ర గన్నేరు‌, తెల్ల గ‌న్నేరు, నాబి, మాదిఫ‌ల‌, బొట్టుగు‌, భాందిరా వంటి 25 రకాల మొక్కలు ఉన్న‌ట్లు తెలిపారు. అదేవిధంగా శ్రీ వేంకటేశ్వర శ్రీగంధపు పవిత్ర ఉద్యానవనంలో శ్రీగంధం, ఎర్రచందనం మొక్కలు పెంచ‌నున్నట్లు తెలిపారు. దాదాపు రూ.1.5 కోట్లతో ఈ ఉద్యాన‌వ‌నాల‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయ‌న వివ‌రించారు.

AP CS Adityanath Das PC: ఏపీలో రాష్ట్ర, జిల్లాస్థాయి మత సామరస్య కమిటీలు.. ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ ఆదిత్యనాథ్‌ దాస్‌