బీజేపీకి ఓటు వేయకుంటే భాగ్యనగరంపై బాంబులతో దాడులు చేస్తారా అని తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. ప్రపంచ దేశాలను కన్న తల్లిలా అక్కున చేర్చుకున్న హైదరాబాద్‌పై సర్జికల్ స్ట్రయిక్‌లు చేస్తారా అని ఆయన మండిపడ్డారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన కొత్తపేట డివిజన్‌లో పర్యటించారు. కమలనాథులు అవాకులు చెవాకులు పేలడం సరికాదని హితవు పలికారు. సర్జికల్ స్ట్రయిక్‌లంటూ ప్రజల్లో భయాందోళన సృష్టించేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని జగదీశ్‌రెడ్డి విమర్శించారు. అలాంటి కుట్రలను తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు.హైదరాబాద్‌లో శాంతి భద్రతలను కాపాడిన ఘనత సీఎం కేసీఆర్‌దే అన్నారు.