AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గులాబీదళంలో కొత్త గుబులు.. కమలంపై ఎదురుదాడేనా?

తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికలొచ్చేశాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలయింది. జనవరి 22న ఎన్నికలు, 25న ఫలితాలు వెలువడనున్నాయి. అధికార టిఆర్‌ఎస్‌ మున్సిపల్‌ పోరాటానికి సమాయత్తమవుతోంది. అయితే దేశవ్యాప్తంగా వివాదాస్పదంగా మారిన సిటిజన్‌షిప్ అమెండ్మెంట్ యాక్టు ప్రభావం తెలంగాణలో ఏ మేరకు ఉంటుందన్న అంశం గులాబీ నేతల్లో ఖంగారు పుట్టిస్తుందని తెలుస్తోంది. సీఏఏను పార్లెమెంటు ఉభయ సభల్లో వ్యతిరేకించిన నేపథ్యంలో మున్సిపల్‌ ఎన్నికల్లో ఎటువంటి ఎఫెక్టు పడుతుందోనని అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు మధన పడుతున్నట్లు సమాచారం. మున్సిపల్ ఎన్నికలకు […]

గులాబీదళంలో కొత్త గుబులు.. కమలంపై ఎదురుదాడేనా?
Rajesh Sharma
|

Updated on: Dec 23, 2019 | 6:44 PM

Share

తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికలొచ్చేశాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలయింది. జనవరి 22న ఎన్నికలు, 25న ఫలితాలు వెలువడనున్నాయి. అధికార టిఆర్‌ఎస్‌ మున్సిపల్‌ పోరాటానికి సమాయత్తమవుతోంది. అయితే దేశవ్యాప్తంగా వివాదాస్పదంగా మారిన సిటిజన్‌షిప్ అమెండ్మెంట్ యాక్టు ప్రభావం తెలంగాణలో ఏ మేరకు ఉంటుందన్న అంశం గులాబీ నేతల్లో ఖంగారు పుట్టిస్తుందని తెలుస్తోంది. సీఏఏను పార్లెమెంటు ఉభయ సభల్లో వ్యతిరేకించిన నేపథ్యంలో మున్సిపల్‌ ఎన్నికల్లో ఎటువంటి ఎఫెక్టు పడుతుందోనని అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు మధన పడుతున్నట్లు సమాచారం.

మున్సిపల్ ఎన్నికలకు ప్రిపేర్ అవుతున్న గులాబీ టీంకు కొత్త వర్రీ మొదలయింది. ప్రస్తుతం దేశంలో హాట్ టాపిక్‌గా మారిన సిటిజన్‌షిప్ అమెండ్‌మెంట్ యాక్ట్ ఇప్పుడు తెలంగాణలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్న అంశంపై టీఆర్ఎస్ పార్టీలో చర్చలు జరుగుతున్నాయి.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సీఏఏ యాక్టును వ్యతిరేకించటం రాష్ట్ర ప్రజల్లోకి ఎలాంటి మెసేజ్ పంపిందన్న అంశాన్ని అంఛనా వేసేందుకు గులాబీ నేతలు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా ముస్లిం కమ్యూనిటీ ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో గ్రౌండ్ లెవెల్‌లో ఎలాంటి చర్చలు జరుగుతున్నాయనే సమాచారాన్ని ద్వితీయ శ్రేణి నాయకత్వం సేకరిస్తోంది.

మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి నేతలు టిఆర్ఎస్ పార్టీని ఎంఐఎం పార్టీని జతకట్టి ప్రచారం చేశారు. హిందూ, ముస్లింల మధ్య ఓట్ల విభజన క్లియర్‌గా కనిపించే నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ పార్లమెంటు స్థానాల్లో బిజెపి ఇదే ప్రచారంతో గులాబీ పార్టీని ఖంగుతినిపించింది. టిఆర్ఎస్ పార్టీని హిందువుల వ్యతిరేక పార్టీగా ముద్ర వేస్తూ.. దానికి ఆ పార్టీతో ఎంఐఎం పార్టీకి వున్న దోస్తానాను ఎత్తి చూపుతూ బిజెపి నేతలు ప్రచారం చేశారు. ఆ ఎఫెక్టు టిఆర్‌ఎస్‌పై బాగానే పడింది. సో ఇప్పుడు కూడా సిటిజన్ షిప్ అమెండ్‌మెంట్‌ యాక్టును టిఆర్ఎస్ పార్టీ వ్యతిరేకించడంతో పాటు తెలంగాణలో ఎన్ఆర్సీని అమలు చేయమని ఖరాఖండీగా చెబుతోంది. ఇది సరిగ్గా అసదుద్దీన్ ఓవైసీ చెబుతున్న మాటలకు ఆల్‌మోస్ట్ దగ్గరగా వుంది.

ఈ అవకాశాన్ని బిజెపి నేతలు వదులుకునే పరిస్థితిలో ఎంతమాత్రం లేరు. ఖచ్చితంగా ముస్లిం, హిందువుల మధ్య ఓట్ల విభజన గణనీయ ప్రభావం చూపే మునిసిపాలిటీల్లో బిజెపి ఇదే అంశాన్ని గట్టిగా ప్రచారం చేస్తుంది. హిందువుల ఓట్లను పోలరైజ్ చేసేందుకు కృషి చేస్తోంది. అదే సమయంలో ఎన్సార్సీని వ్యతిరేకిస్తున్న టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య ముస్లింల ఓట్లు చీలే అవకాశాలు పుష్కలంగా వుంటాయి. ఇది బిజెపికి అనుకూలంగా మారుతుందేమోనన్న భయం గులాబీదళంలో వ్యక్తమవుతోంది.

ఒక వైపు బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఇప్పటికే టిఆర్ఎస్‌పై దాడి మొదలు పెట్టింది. కేవలం ఎంఐఎం కోసమే టిఆర్ఎస్ కేంద్రం తీసుకొచ్చిన చట్టాన్ని వ్యతిరేకిస్తోందని, హిందువులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని, బీజేపీ విమర్శలు చేస్తోంది. దీంతో టిఆర్ఎస్ అలెర్ట్ అయింది. ఒక వైపు ప్రజల నాడి తెలుసుకుంటూనే మరో వైపు బిజెపి విమర్శలు, ఆరోపణలను తిప్పికొట్టాలని హైకమాండ్‌ ఆదేశించినట్టు సమాచారం..

టిఆర్ఎస్ నేతలు బిజెపి ఎంపీలు ఉన్న కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇక్కడ ముస్లిం కమ్యూనిటీ కూడా ఎక్కువే ఉంది కాబట్టి. బిజెపి ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని టిఆర్ఎస్‌ భావిస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో అన్ని మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటామని టిఆర్ఎస్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇప్పుడు ఈ సీఏఏ యాక్ట్ ప్రభావాన్ని స్టడీ చేసే పనిలో ఉన్నారు టిఆర్‌ఎస్‌ పెద్దలు.