ఆ రైలు విషాదానికి సరిగ్గా ఏడాది పూర్తి.. ఇప్పటికీ పరిహారం అందని బాధితులు

దసరా పండుగకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. విజయానికి గుర్తుగా జరుపుకునే ఈ పండగలో ఆయుధపూజతో పాటు రావణ దహనానికి ఎంతో ప్రాముఖ్యముంది. ముఖ్యంగా రావణ దహన కార్యక్రమం ఎంతో గొప్పగా నిర్వహిస్తుంటారు. పిల్లా పాపలతో సంతోషాంగా రావణ దహన వేడుకలకు హాజరవుతారు. ఎంతో ఆనందంగా కేరింతలతో సాగే ఈ కార్యక్రమాన్ని చూడాలని వెళ్లిన కొంతమందిని రైలు రూపంలో మృత్యువు కబళించిన ఘటనకు సరిగ్గా ఏడాది పూర్తయింది. దసరా వేడుకల్లో భాగంగా గత ఏడాది అక్టోబర్ 19న పంజాబ్‌లోని […]

ఆ రైలు విషాదానికి సరిగ్గా ఏడాది పూర్తి.. ఇప్పటికీ పరిహారం అందని బాధితులు

Edited By:

Updated on: Oct 08, 2019 | 10:12 PM

దసరా పండుగకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. విజయానికి గుర్తుగా జరుపుకునే ఈ పండగలో ఆయుధపూజతో పాటు రావణ దహనానికి ఎంతో ప్రాముఖ్యముంది. ముఖ్యంగా రావణ దహన కార్యక్రమం ఎంతో గొప్పగా నిర్వహిస్తుంటారు. పిల్లా పాపలతో సంతోషాంగా రావణ దహన వేడుకలకు హాజరవుతారు. ఎంతో ఆనందంగా కేరింతలతో సాగే ఈ కార్యక్రమాన్ని చూడాలని వెళ్లిన కొంతమందిని రైలు రూపంలో మృత్యువు కబళించిన ఘటనకు సరిగ్గా ఏడాది పూర్తయింది.

దసరా వేడుకల్లో భాగంగా గత ఏడాది అక్టోబర్ 19న పంజాబ్‌లోని అమృత్‌సర్‌లోని చౌరా బజార్, జోడా పాఠక్ క్రాసింగ్ వద్ద గత ఏడాది సరిగ్గా ఇదే రోజున రావణ దహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ వేడుకకు మాజీ క్రికెటర్ నవజోత్ సిద్ధు భార్య నవజోత్ కౌర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రైలుపట్టాలకు అవతల ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని చూసేందుకు చిన్నారులతో సహా వందలాది మంది ఉత్సాహంగా తరలివచ్చారు. అయితే ఈ జనం రైలు పట్టాలపై నిలబడి చూస్తుండగా అటుగా వస్తున్న రైలు ఒక్కసారిగా వారిపై నుంచి దూసుకుపోయింది. అప్పటివరకు ఎంతో సంతోషంగా ఉన్నవారంతా క్షణాల్లో విగత జీవులుగా మిగిలారు. చిద్రమైన శరీరాలతో, గుర్తుపట్టలేని స్థితిలో కేవలం రక్తపు ముద్దలు మిగిలాయి. కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రాణాలతో బయటపడ్డా.. అవయవాలు కోల్పోయి దివ్యాంగులుగా మరికొందరు మిగిలిపోయారు. ఇదంతా క్షణాల్లోనే జరిగిపోయింది. ఈ ఘోర దుర్ఘటనలో 60 మంది ప్రాణాలు కోల్పోగా, 70 మంది తీవ్రంగా గాయపడ్డారు.

ఈ విషాదకర ఘటన బాధిత కుటుంబాల కళ్లలో ఇంకా మెదులుతోంది. తమ జీవితంలో మర్చిపోలేనంత విషాదాన్ని నింపిన ఈ దుర్ఘటన తర్వాత బాధితులకు అందాల్సిన పరిహారం ఇప్పటికీ అందలేదు. ఇప్పటికీ ఎలాంటి న్యాయం జరగకపోవడంతో బాధితులు ఎన్నో బాధలు అనుభవిస్తున్నారు. తమకు ఇస్తానన్న నష్టపరిహారం తమకు ఇవ్వాలంటూ పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌ను డిమాండ్ చేస్తున్నారు.

తమకు న్యాయం చేయాలంటూ బాధిత కుటుంబాలకు చెందినవారు మంగళవారం అమృత్ సర్ లో నిరసన ర్యాలీ చేపట్టారు. ఏడాది కాలంగా నష్టపరిహారం కోసం అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నామని .. తాము ఎంతో విసిగిపోయామని చెబుతున్నారు. ప్రభుత్వం స్పందించకపోతే తమ వాళ్లను కోల్పోయిన రైలు పట్టాల వద్దే తాము ఆందోళకు దిగుతామంటున్నారు.