విజేతగా నిలిచిన స్మృతి మంధాన

విజేతగా నిలిచిన స్మృతి మంధాన

మహిళల టీ20 ఛాలెంజ్‌-2020 సీజన్‌ విజేతగా స్మృతి మంధాన సారథ్యంలోని ట్రయల్‌ బ్లేజర్స్‌ నిలిచింది. సోమవారం డిఫెండింగ్‌ ఛాంపియన్‌ సూపర్‌ నోవాస్‌తో జరిగిన టైటిల్‌ పోరులో బ్లేజర్స్‌ 16 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Sanjay Kasula

|

Nov 09, 2020 | 11:35 PM

Trailblazers Win : స్మృతి మంధాన సారథ్యంలోని ట్రయల్‌ బ్లేజర్స్‌ మహిళల టీ20 ఛాలెంజ్‌-2020 సీజన్‌ విజేతగా నిలిచింది. మహిళల టీ20 లీగ్‌ మూడో సీజన్‌ను ట్రయల్‌బ్లేజర్స్‌ ఎగురేసుకు పోయింది. షార్జా వేదికగా జరిగిన ఫైనల్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ సూపర్‌నోవాస్‌ను 16 పరుగుల తేడాతో చిత్తు చేసి తొలి టైటిల్‌ను ముద్దాడింది.

తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ట్రయల్‌బ్లేజర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 118 పరుగులు చేసింది. స్మృతి మంధాన 49 బంతుల్లో 68 పరుగులు చేసి కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయారు. అనంతరం బరిలోకి దిగిన సూపర్‌నోవాస్‌ 20 ఓవరల్లో ఏడు వికెట్లు కోల్పోయి 102 పరుగులకే పరిమితమైంది. హర్మన్‌ప్రీత్‌ 36 బంతుల్లో 30 పరుగులు చేసి టాప్‌ స్కోరర్‌గా నిలిచింది‌. సాల్మ (3/18), దీప్తి (2/9) ఆ జట్టును దెబ్బతీశారు.

టార్గెట్‌ను ఛేదనకు దిగిన సూపర్‌నోవాస్‌ ఏ దశలోనూ పైచేయి సాధించ లేక పోయింది. దీప్తి శర్మ ధాటికి 37 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన శశికళతో కలిసి హర్మన్‌ప్రీత్‌ ఇన్నింగ్స్‌ చక్కదిద్దే ప్రయత్నం చేసింది. కాగా, దూకుడుగా ఆడే క్రమంలో శశికళ వెనుదిరిగింది.

మరోవైపు హర్మన్‌ప్రీత్ తన పోరాటం కొనసాగించింది. అడపాదడపా బౌండరీలు సాధిస్తున్నప్పటికీ కావాల్సిన రన్‌రేటు భారీగా పెరిగిపోయింది. ఆఖరి 12 బంతుల్లో 27 పరుగులు అవసరమవగా.. సాల్మ మూడు వికెట్లు తీసి 4 పరుగులే ఇవ్వడంతో సూపర్‌నోవాస్ ఓటమి ఖరారైంది.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu