Three BJP MPs: బీజేపీకి దూరంగా ఈ ముగ్గురు.. ఎందుకంటే!

|

Feb 20, 2020 | 2:10 PM

ఇటీవల బీజేపీలో చేరిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు క్రియాశీలకంగా లేకపోవడం ఏపీ బీజేపీలో చర్చనీయాంశంగా మారింది. ఈ ముగ్గురు పార్టీ కార్యకలాపాలకు, అంతర్గత భేటీలకు దూరంగా వుండడం వెనుక కారణలేంటనేది ఆరా తీస్తున్నారు.

Three BJP MPs: బీజేపీకి దూరంగా ఈ ముగ్గురు.. ఎందుకంటే!
AP BJP Leaders CM Ramesh, Sujana, TG Venkatesh
Follow us on

Three BJP RS MPs are slowly distancing from party: మొన్నామధ్య టీడీపీ రాజ్యసభాపక్షాన్ని చీల్చి మరీ బీజేపీలో చేరిపోయిన ఈ ముగ్గురు ఎంపీలు ఇపుడు పార్టీకి అంటీముట్టనట్లుగా మారిపోవడం ఇపుడు ఏపీలో కొత్త చర్చకు తెరలేపింది. టీడీపీకి మొత్తం ఆరుగురు ఎంపీలుంటే.. అందులోంచి నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో విలీనమయ్యారు. ఎలాంటి టెక్నికాలిటీస్ అడ్డురాకపోవడంతో కూల్‌గా పార్టీ మారిపోయారు. ఆ తర్వాత మొదట్నించి బీజేపీలో వున్న నేతలకంటే ఎక్కువ హడావిడి చేశారు కమలదళంలో.

కానీ గత కొంత కాలంగా ఈ ముగ్గురు పార్టీకి అంటీముట్టనట్లుగా మారిపోయారు. పార్టీ సమావేశాలకు రావడంలేదు. పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమాలకు దూరంగా వుంటూ వస్తున్నారు. ఈ ముగ్గురిలో సడన్‌గా వచ్చిన మార్పు ఏపీలో కొత్త చర్చకు తెరలేపింది. బీజేపీ ఎంపీలుగా మారిన మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి బీజేపీలో ఎంతో కొంత హడావిడి చేశారు. మూడు రాజధానుల ప్రతిపాదన తెరమీదికి వచ్చిన తర్వాత కూడా సుజనాచౌదరి ప్రభుత్వ ప్రతిపాదనకు వ్యతిరేకంగా మాట్లాడారు.

ఒక దశలో జీవిఎల్ నరసింహారావు వంటి నేతతోను రాజధాని విషయంలో తలపడ్డారు. రాజధాని ఎంపిక విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనిదంటూ జీవిఎల్ చేసిన కామెంట్లను బహిరంగంగా తప్పుపట్టారు. చివరికి తన మాటే నెగ్గించుకున్నారు. కానీ ఆ తర్వాత స్లోగా ఆయన సైలెంటైపోయారు. మరోవైపు మూడు రాజధానుల ప్రతిపాదనపై తనదైన స్టైల్‌లో స్పందించిన టీజీ వెంకటేశ్.. మొత్తం రాజధానిని కర్నూలుకు తరలించాలని వాదించారు. ఆ తర్వాత ఆయన మౌనం వహించారు. ఇక సీఎం రమేశ్ తన కుమారుని వివాహం పేరుతో దాదాపు నెల రోజులుగా రాజకీయ కార్యకలాపాలకు దూరంగా వుంటున్నారు.

తాజాగా ఈ ముగ్గురు ఎంపీల మౌనం వెనుక కారణాలేంటని కమలదళంలోను, ఏపీ రాజకీయ నేతల్లోను చర్చ నడుస్తోంది. వైసీపీ అధినేత జగన్ విషయంలో బీజేపీ అధినాయకత్వం సాఫ్ట్ ధోరణిని అవలంభిస్తుండడం వల్లనే ఈ ముగ్గురు పార్టీతో అంటీముట్టనట్లుగా మారిపోయారని చెప్పుకుంటున్నారు. గురువారం విజయవాడలో జరిగిన బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశానికి ముగ్గురు ఎంపీలు హాజరు కాలేదు. పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్వయంగా పిలిచినప్పటికీ సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్ గైర్హాజరయ్యారు. బుధవారం కడప నగరంలో బీజేపీ నిర్వహించిన మహా ధర్నాకు ఆ జిల్లాకు చెందిన సీఎం రమేశ్ హాజరు కాలేదు.

పార్టీ సమావేశాలకు రాకపోవడం, పార్టీ పిలుపునిచ్చిన ప్రోగ్రామ్స్‌లో పాల్గొనకపోవడం, పార్టీ విధానాలపై పాత్రికేయ సమావేశాలు కూడా నిర్వహించకపోవడం వంటి విధానాలతో ఈ ముగ్గురు ఎంపీలు దూరమవుతుండడంపై గురువారం జరిగిన బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశంలో సీనియర్లు చర్చించినట్లు తెలుస్తోంది. వీరిని సంప్రదించే బాధ్యతను జీవిఎల్, కన్నాలపై పెట్టినట్లు తాజా సమాచారం.

Also read: BJP, TRS leaders fighting for protocol