
వాయువ్య ఫ్రాన్స్ లో గతనెల 30 రాత్రి నాలుగు రైళ్లలోని ప్రయాణికులు సుమారు 20 గంటలపాటు నరకం అనుభవించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడి ఈ రైళ్లలో కరెంట్ లేకపోవడంతో ఇవి ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇక వేలాది ప్రయాణికులకు కష్టాలు మొదలయ్యాయి. ముఖ్యంగా వృధ్ధులు, పిల్లలు, మహిళల బాధలు ఇన్నీఅన్నీ కావు. నీటికోసం, ఆహారం కోసం, స్వచ్ఛమైన గాలికోసం అంతా అల్లాడిపోయారు. పైగా ఈ కరోనా సీజన్ లో ముఖాలకు మాస్కులు తీయలేని పరిస్థితి.. అనేకమంది ఊపిరాడక ఇబ్బంది పడ్డారు. బోర్డెక్స్ నగరాన్ని ఇతర ప్రాంతాలతో కలిపే ఈ నాలుగు రైళ్లలో ఇలాంటి దారుణ అవస్థను ప్రయాణికులు ఎదుర్కొనాల్సి వచ్చింది. చివరకు నిన్న ఉదయానికి గానీ విద్యుత్ సరఫరా పునరుధ్ధరణ కాలేదు. రైళ్లు సమీప స్టేషన్లలో ఆగగానే అస్వస్థులుగా ఉన్నవారిని ఆసుపత్రులకు తరలించారు. పవర్ గ్రిడ్ లో ఏర్పడిన లోపమే ఇందుకు కారణమని అధికారులు అంటున్నారు.