మన ఇంట్లో ఏవైనా వస్తువులు పోతే వెళ్లి పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేస్తాం..మరి పోలీస్ స్టేషన్‌లోనే చోరీ చేస్తే?..అవును మీరు వింటున్నది నిజమే. ఉత్తరప్రదేశ్‌లోని సాహిబాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. స్టేషన్‌లోకి చొరబడిన దొంగలు.. అక్కడి స్టోర్ రూంలో నుంచి అనేక వస్తువులు ఎత్తుకెళ్లారు. కాగా.. చోరీ జరిగిందనే విషయాన్ని పోలీసులు 24 గంటల దాకా గుర్తించలేకపోవడం కొసమెరుపు.
వివరాల్లోకి వెళితే..పలు కేసుల్లో స్వాధీనం చేసుకున్న, రికవరీ చేసుకున్న ఫోన్లు, కార్లు, ఇతర వస్తువులను పోలీసులు స్టేషన్‌లోని స్టోర్‌రూంలో భద్రపరుస్తుంటారు. సాహిబాబాద్ పోలీస్ స్టేషన్‌లోని స్టోర్ రూంలోకి మే 18 అర్ధరాత్రి సమయంలో కొందరు దొంగలు దోపిడీకి పాల్పడ్డారు . 90 బ్యాటరీలు, రెండు గ్యాస్ సిలిండర్లు, ఫోన్లు, సీసీటీవీ కెమెరాలు, కార్లలోని విడి భాగాలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటన జరిగిన 24 గంటల తర్వాత మే 20వ తేదీ ఉదయం స్టోర్ ఇన్‌ఛార్జ్ గది దగ్గరకు వెళ్లగా తాళం పగలగొట్టి కన్పించింది. దీంతో వెంటనే ఆయన పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చోరీతో సంబంధమున్న ఇద్దరు మహిళలను అరెస్టు చేసి కొన్ని వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇతర నిందితుల కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు.